ధనుర్మాసంలో దర్శించాల్సిన పంచరంగ క్షేత్రాలు – ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత

ధనుర్మాసం.. శ్రీమహావిష్ణువికి ప్రీతికరం. ఈ మాసంలో విష్ణుభక్తికి ఆనవాళ్లు... పరమ పవిత్రమైన.. పంచరంగ క్షేత్రాలను దర్శిస్తే.. ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. ఇంతకీ పంచరంగ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా...? వాటి విశిష్టత గురించి విన్నారా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 04:47 PMLast Updated on: Dec 20, 2024 | 4:47 PM

Five Places To Visit During The Month Of Dhanur Each Place Has Its Own Unique Features

ధనుర్మాసం.. శ్రీమహావిష్ణువికి ప్రీతికరం. ఈ మాసంలో విష్ణుభక్తికి ఆనవాళ్లు… పరమ పవిత్రమైన.. పంచరంగ క్షేత్రాలను దర్శిస్తే.. ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. ఇంతకీ పంచరంగ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా…? వాటి విశిష్టత గురించి విన్నారా..? అయితే… ఇప్పుడు తెలుసుకుందాం. పంచరంగ క్షేత్రాలను ఒకసారి దర్శించుకుందాం.

పంచారామ క్షేత్రాల గురించి అందరికీ తెలుసు. కానీ… పంచరంగ క్షేత్రాల గురించి… చాలా మందికి తెలియకపోవచ్చు. శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా కొలిచే రంగనాథస్వామి కొలువైన.. పవిత్రమైన దేవాలయాలే పంచరంగ క్షేత్రాలు. దక్షిణ భారతదేశంలో రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో ఎన్నో పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అన్నింటిలోకి కావేరి నది తీరంలో ఉన్న పంచరంగ క్షేత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.

పంచరంగ క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం. దీనిని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. టిప్పు సుల్తాన్‌తోపాటు కర్నాటకను ఏలిన రాజులంతా శ్రీరంగం రంగనాథస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించారు.

పంచరంగ క్షేత్రాల్లో రెండోది తిరుప్పునగర్‌. ఆ ఆలయం… తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. ఇక్కడ స్వామివారిని అప్పకుడతాన్‌ పెరుమాళ్‌ అని పిలుస్తారు. కొల్లిడం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఒడ్డున ఉంది.

పంచరంగ క్షేత్రాల్లో మూడోది కుంభకోణం. దీన్ని సారంగపాణి దేవాలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని తంజోర్‌ జిల్లాలో కావేరి నది ఒడ్డున ఉంది. కుంభకోణం రైల్వేస్టేషన్‌కు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంటుంది ఆ ఆలయం. సారంగపాణిస్వామిని.. విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం…. లక్ష్మీదేవి తన కూతురుగా పుట్టాలని హేమ రుషి తపస్సు చేశాడట. ఆయన తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి తటాకంలో కలువల నుంచి ఉద్భవించిందట. లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి సారంగపాణి రూపంలో తరలివచ్చారట. సారంగపాణి స్వామిని.. అరవముదన్‌ అని కూడా పిలుస్తారు.

పంచరంగ క్షేత్రాల్లో నాలుగోది మయిలదుతురై. ఈ ఆలయం కూడా కావేరి నది ఒడ్డునే ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి చంద్రుని తపస్సుకు మెచ్చి అవతరించాడు. ఈ ఆలయంలోని స్వామివారిని పరిమళ రంగనాథ పెరుమాళ్‌ అని పిలుస్తారు. ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఆ ఆలయం ఒకటి. అంతేకాదు ఇక్కడ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని కూడా చెప్తారు.

పంచరంగ క్షేత్రాలలో ఐదవది శ్రీరంగపట్న అరంగనాథ స్వామి ఆలయం. ఈ క్షేత్రాన్ని ఆద్యరంగం అంటే చివరి క్షేత్రంగా కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి చేతిలోని శంఖం రూపంలో కనిపించే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయాన్ని నిర్శించారు. ఈ ఆలయంలోని మూర్తిని విభీషణుడు ప్రతిష్టించాడని చెప్తారు. విష్ణుమూర్తిని గోదాదేవి వివాహమాడింది కూడా ఈ క్షేత్రంలోనే.