ఛాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్, భారత జట్టు ప్రకటన ఆ రోజే

సుధీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఇక తర్వాతి సిరీస్ లో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై వైట్ బాల్ మ్యాచ్ లకు రెడీ కానుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2025 | 05:36 PMLast Updated on: Jan 06, 2025 | 5:36 PM

Focus On Champions Trophy Indian Team Announcement On The Same Day

సుధీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ విజయంతో సరిపెట్టుకున్న టీమిండియా ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఇక తర్వాతి సిరీస్ లో ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై వైట్ బాల్ మ్యాచ్ లకు రెడీ కానుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. కాగా ఈ రెండు సిరీస్ లకు భారత జట్టు ఎంపిక త్వరలోనే ఉంటుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను జనవరి 11న ప్రకటించబోతున్నారు. జనవరి 12న ఐసీసీకి ప్రతీ టీమ్ లిస్టును సమర్పించాల్సి ఉండగా.. ఒకరోజు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌నే డిమాండ్లు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ ఇద్ద‌రికి వ‌న్డేల్లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ చివ‌రిదని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఈ ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్లు ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో వీరిద్ద‌రు ఎలా ఆడతారనేది చూడాలి.

కాగా మెగా టోర్నీ కోసం భారత జట్టును రోహిత్ శర్మ లీడ్ చేయనుండగా.. శుభమన్ గిల్ మరో ఓపెనర్ గా చోటు దక్కించుకోనున్నాడు. దీంతో జైశ్వాల్ కు నిరాశే మిగలనుంది. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే.. అయితే జాతీయ జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్న అయ్యర్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు సెంచరీలతో దుమ్మురేపాడు. ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, సెకండ్ కీపర్ గా రాహుల్ ఉండడంతో సంజూ శాంసన్ కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. అటు ఆల్ రౌండర్ కోటాలో హార్థిక్ పాండ్యాతో పాటు తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశాలున్నాయి. టీ ట్వంటీ, ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ లో అదరగొట్టిన నితీశ్ కు వన్డేల్లో సత్తా చాటేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు చోటు ఖాయం. అయితే మరో ప్లేస్ కోసం కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ మధ్య పోటీ నెలకొంది.

కుల్దీప్ ఫిట్ నెస్ సాధించకుంటే మాత్రం బిష్ణోయ్ కు ఛాన్స్ దక్కనుంది. మరోవైపు పేస్ విభాగంలో బుమ్రా లీడ్ చేయనున్నాడు. సిడ్నీ టెస్టులో వెన్నునొప్పితో మధ్యలోనే తప్పుకున్న బుమ్రా ఇంగ్లాండ్ తో సిరీస్ కు దూరమయ్యే ఛాన్సుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తిగా కోలుకుని జట్టులోకి రానున్నాడు. అలాగే జాతీయ జట్టుకు దూరమైన మహ్మద్ షమీ కూడా జట్టులోకి వస్తాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ కు కూడా షమీ ఎంపిక లాంఛనమే. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం, ఫిట్ నెస్ సమస్యలతో షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. ఇక మిగిలిన పేసర్లుగా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ ఎంపికయ్యే ఛాన్సుంది.

కాగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫిబ్ర‌వ‌రి 19 నుంచి హైబ్రిడ్ మోడ్‌లో జ‌ర‌గ‌నుంది. పాకిస్థాన్ వేదిక‌గా ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుండ‌గా, టీమ్ఇండియా ఆడే మ్యాచుల‌ను దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.ఎనిమిది జ‌ట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేయగా.. సెమీఫైన‌ల్స్‌, ఫైన‌ల్ క‌లిపి మొత్తం 15 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. గ్రూప్ స్టేజీలో భార‌త జ‌ట్లు త‌న తొలి మ్యాచ్‌ను ఫిబ్రవ‌రి 20న బంగ్లాదేశ్‌తో ఆడ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 23న జ‌ర‌గ‌నుంది.