Ram Mandir Pran Pratishta : కొబ్బరి నీళ్లే ఆహారం.. కటిక నేలపై నిద్ర.. రాములోరి కోసం 18రోజులు మోదీ కఠిన దీక్ష…
ప్రపంచం చూపు అంతా.. అయోధ్య వైపే ఉన్న వేళ.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. వందల ఏళ్ల కల సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
ప్రపంచం చూపు అంతా.. అయోధ్య వైపే ఉన్న వేళ.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. వందల ఏళ్ల కల సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి… భక్తజనం ఆత్మారాముడిని మనసులోనే కొలుచుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య.. ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.
రాములోరి ప్రాణప్రతిష్ఠ కర్మకు మోదీ చేసిన దీక్ష.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రాణ ప్రతిష్టకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన నియమాలపై.. మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ.. నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోయారు. ఒక్కరోజు.. రెండురోజులు కాదు.. ప్రాణప్రతిష్ఠకు 18రోజుల ముందు నుంచి మోదీ ఇదే అనుసరించారు. ఏ ఒక్కరోజు కూడా ఆహారం తీసుకోలేదు.
ఈ కఠినమైన నియమ నిబంధనలను అనుసరిస్తూనే.. ప్రధాని తన అధికారిక పనులు నిర్వహించారు. గత వారంరోజుల్లో మహారాష్ట్ర, కేరళ, ఏపీలోనూ పర్యటించారు.రాములోరి ప్రాణప్రతిష్ఠలో అనుష్ఠానంలో భాగంగా పాటించే నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, యోగా.. ధ్యానం చేయటం, సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు. మోదీ ఇవే ఆచరించారు. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16నుంచి ఆరు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరిగాయ్. ఐతే వ్యక్తిగత, భద్రతా కారణాలతో.. మోదీ ఇలాంటివి నిర్వహించలేరు. దీంతో ఆయనకు బదులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు అన్ని పూజల్లో పాల్గొన్నారు.