Akash Chopra: ముగ్గురు పేసర్లు తప్పదు.. ముల్లును ముల్లుతోనే తీయాలి
పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు
పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
ఈ నేపథ్యంలో నేపాల్‌పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను రెండు మ్యాచ్‌లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్. ఇందులో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్‌లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు. పాక్‌ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్‌బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్‌లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు.