AP Skill Development : ఏపీ స్కిల్ కేసుపై ఉండవల్లి ‘పిల్’.. ఏం జరగబోతోంది..?
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చుట్టుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన ఈ కేసుకు రెండు, మూడు రాష్ట్రాలతో ఉన్న లింకులు, నిందితులుగా ప్రముఖ వ్యక్తులు ఉన్నందున ఇన్వెస్టిగేషన్ ను సీబీఐ, ఈడీలకు అప్పగిస్తే నిజానిజాలు బయటికి వస్తాయని పిటిషన్‌లో ఉండవల్లి పేర్కొన్నారు. జీఎస్టీ ఎగవేత వంటి వ్యవహారాలు ఈ కేసులో ఉన్నందున.. దీనిపై ఇప్పటికే ఈడీ కూడా ఫోకస్ పెట్టిందని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, డిజైన్‌టెక్ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ వచ్చే వారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏసీబీ కోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఈరోజు ఉదయం 11 గంటలలోగా ( ఇంకో గంటలో) ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి ఇవాళ లేదా సోమవారం ఇచ్చే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై బుధవారమే వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మరిన్ని విషయాలను బయటికి తెచ్చేందుకుగానూ టీడీపీ చీఫ్ ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. రాజకీయ కక్ష పూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
చిట్ ఫండ్స్ చట్టాన్ని రామోజీ .. అతిక్రమించారా.?
ఇక ఇటువంటి కీలకమైన కేసులలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేయడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ఫేమస్ అయ్యారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపైనా ఆయన లీగల్ ఫైట్ చేస్తున్నారు. చిట్ ఫండ్స్ చట్టాన్ని రామోజీ రావు, శైలజా కిరణ్ అతిక్రమిస్తూ వస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూప్‌లోని ఇతర సంస్థలకు మళ్లించారని అంటున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఉండవల్లి మార్గదర్శి వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు వ్యవహారంలోనూ లీగల్ ఫైట్‌కు ఉండవల్లి రెడీ అయ్యారు. ఆయన పిటిషన్ పై హైకోర్టు నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది ? ఏపీ స్కిల్ కేసును సీబీఐ, ఈడీలకు అప్పగిస్తారా ? అప్పగిస్తే ఏమవుతుంది ? అనే దానిపై ఇప్పుడు అంతటా డిస్కషన్ జరుగుతోంది.