Telangana Former CM KCR : జనంలోకి వస్తున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్. జనాన్ని పట్టించుకోకపోవడం.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం.. అహంకారం.. ఇలా ఎన్నో అంశాలు BRS ఓటమికి కారణాలయ్యాయి. అన్నింటి కంటే ముఖ్యం.. కేసీఆర్ తాను నమ్మిందే ఆచరించడం.. జనాన్ని దరిదాపుల్లోకి రానీయకపోవడం.. ఈ రెండే BRS ను ముంచాయి. అందుకే కేసీఆర్ తెలివి తెచ్చుకున్నట్టు ఉన్నారు. ఫిబ్రవరి నుంచి జిల్లా పర్యటనలకు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2024 | 04:08 PMLast Updated on: Jan 06, 2024 | 4:08 PM

Former Telangana Cm Kcr Is Going To Visit The Districts Soon

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్. జనాన్ని పట్టించుకోకపోవడం.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం.. అహంకారం.. ఇలా ఎన్నో అంశాలు BRS ఓటమికి కారణాలయ్యాయి. అన్నింటి కంటే ముఖ్యం.. కేసీఆర్ తాను నమ్మిందే ఆచరించడం.. జనాన్ని దరిదాపుల్లోకి రానీయకపోవడం.. ఈ రెండే BRS ను ముంచాయి. అందుకే కేసీఆర్ తెలివి తెచ్చుకున్నట్టు ఉన్నారు. ఫిబ్రవరి నుంచి జిల్లా పర్యటనలకు.. జనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.. పదేళ్ళల్లో రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ఈ రెండు ప్లస్ పాయింట్స్ ని ఇక్కడి జనం ఎవరూ కాదనరు. కానీ వచ్చిన చిక్కల్లా.. జనంలో కలవకపోవడం.. ప్రజల వాయిస్ వినే ప్రయత్నం చేయకపోవడం మైనస్ గా మారాయి. కేసీఆర్ మాత్రమే కాదు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీ అదే విధానం. రాష్ట్రంలో పేపర్ల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలు, అత్యాచారాలు.. భారీ ప్రమాదాలు.. ఏవైనా జరగనీయండి.. అప్పట్లో ముఖ్యమంత్రి నుంచి స్పందన వచ్చేది కాదు.. ప్రగతి భవన్ పరిసరాల్లోకి కూడా జనాన్ని రానిచ్చేవారు కాదు. ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ కీ.. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడాను జనం స్పష్టంగా గమనిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్భార్ ప్రకటించగానే.. వందలు, వేల మంది జనం.. జిల్లాల నుంచి పిటిషన్లు తీసుకొని ప్రజాభవన్ కు క్యూ కట్టారు. అంటే వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

పదేళ్ళు పాలించారు.. మళ్ళీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడదాం అని ఆశపడ్డారు కేసీఆర్. కానీ తెలంగాణ జనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. ఇప్పటికైనా తెలిసొచ్చిందో లేదో గానీ.. కేసీఆర్ మాత్రం ఫిబ్రవరి నుంచి జనంలో తిరుగుతారట. కేసీఆర్ కోలుకుంటున్నారు.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై జనంలోకి వస్తారు.. జిల్లాల పర్యటనకు వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతేకాదు.. ప్రతి రోజూ ప్రగతి భవన్ కు వచ్చి.. కార్యకర్తలను కలుస్తారని కూడా చెప్పారు.

ఇప్పటికప్పుడు కేసీఆర్ లో ఎందుకింత మార్పు వస్తోందంటే.. ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి బీఆర్ఎస్ కి 2,3 ఎంపీ సీట్లు రావడం కూడా కష్టమే అంటున్నారు. జనరల్ గా లోక్ సభ ఎన్నికలు అంటే మోడీ వర్సెస్ కాంగ్రెస్ చూస్తారు. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించిన జనం.. ఆ తర్వాత కొద్ది నెలలకే వచ్చిన 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కు జనం ఎలా ఓట్లేస్తారు.. అధికారంలో ఉంది కాంగ్రెస్.. కేంద్రంలో ఉంది బీజేపీప్రభుత్వం. ఈ రెండింటినీ కాదని బీఆర్ఎస్ ఓట్లేయ్యడం కష్టమే. అందుకే మళ్ళీ తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై ఒత్తిడి పెంచాలి.. రేవంత్ సర్కార్ పై విమర్శలు చేయాలి.. తమ ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తోందని జనాన్ని రెచ్చగొట్టాలి.. ఈ మూడు అంశాలే ఎజెండాగా లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్తోంది. అందుకే కేసీఆర్ మళ్ళా జనంలో తిరిగాలని భావిస్తున్నారు. గతంలో హెలికాప్టర్లలో.. కార్లు.. బస్సుల్లో చేతులు ఊపుకుంటే వెళ్ళిన కేసీఆర్.. ఇప్పుడు జనంలో నడుస్తారా.. వాళ్ళ సమస్యలు స్వయంగా వింటారా అన్నది చూడాలి. విన్నా వినొచ్చు.. ఓట్లు.. సీట్లు కావాలంటే ఏ రాజకీయ నాయకుడికి అయినా తప్పదు మరి.