నీకు వేలంలో కోటి కూడా రాదు ప్రియాన్ష్ ను ఎగతాళి చేసిన ఫ్రెండ్స్
ఐపీఎల్ చాలా మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కేందుకు కూడా ఐపీఎల్ మంచి వేదిక.. కానీ ఏదో నార్మల్ ఆటను ప్రదర్శిస్తే మాత్రం ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు.

ఐపీఎల్ చాలా మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కేందుకు కూడా ఐపీఎల్ మంచి వేదిక.. కానీ ఏదో నార్మల్ ఆటను ప్రదర్శిస్తే మాత్రం ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. బ్యాటర్లయితే తమ సత్తాకు తగ్గట్టు ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాలి..బౌలర్లయితే అద్భుతమైన స్పెల్స్ తో అందరినీ తమవైపు తిప్పుకోవాలి… ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల గేమ్ కాబట్టి ఇక్కడ మెరుపు ఇన్నింగ్స్ లు అందులోనూ సెంచరీ చేస్తే వచ్చే గుర్తింపే వేరు.. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ లో ప్రియాన్ష్ ఆర్య సెంచరీతో అదరగొట్టాడు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టాప్ టీమ్ పై, వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికారేసి మరీ శతక్కొట్టాడు. అందుకే ఇప్పుడు ప్రియాన్ష్ ఆర్య పేరు మారుమోగిపోతోంది. నిజానికి ఢిల్లీ టీ ట్వంటీ లీగ్ సమయంలోనే ఆరు సిక్సర్లు కొట్టి క్రికెట్ ప్రపంచం తనగురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అదిరిపోయే సెంచరీతో మళ్ళీ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు.
ప్రియాన్ష్ ఆర్య పేరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అతని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఢిల్లీలోని సామాన్య ప్రదేశం నుంచి వచ్చి ఐపీఎల్ 2014 ఫైనలిస్ట్ అయిన పంజాబ్ కింగ్స్ కు ఆడే వరకు ప్రియాన్ష్ జర్నీ స్ఫూర్తినిచ్చేదే.. అందరిలానే కోచింగ్ కు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఢిల్లీ క్రికెట్ లో రాణించడం అంత సులువు కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పోటీ కంటే ఇక్కడ ఉండే పోటీ చాలా ఎక్కువ. కానీ ప్రియాన్ష్ ఆర్యకు కోచ్ సంజయ్ భరద్వాజ్ అండగా నిలిచాడు. ఢిల్లీ అండర్-19 ట్రయల్స్ లో ప్రియాన్ష్ కు ఛాన్స్ రావడం కోసమని అతను ఓ టోర్నీలో ఆడేందుకు 45 వేలను కోచ్ చెల్లించాడు. అతను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిస్తే అండర్-19 సెలక్టర్ గురుశరణ్ సింగ్ ను రిక్వెస్ట్ చేయాలని అనుకున్నట్టు సంజయ్ భరద్వాజ్ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల ప్రియాన్ష్ బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడని చెప్పాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు ఓవర్ నైట్ స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాన్ష్ 166.91 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు చేశాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టోర్నమెంట్లో అతని ప్రదర్శనను గమనించాడు. వేలానికి ముందు ప్రియాన్ష్ పై ఓ లక్కేయాలని ఫ్రాంఛైజీలను కోరాడు. చివరకు పంజాబ్ కింగ్స్ అతణ్ని దక్కించుకుంది. కానీ వేలానికి ముందు జరిగిన కొన్ని విషయాలను కోచ్ సంజయ్ భరద్వాజ్ మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ప్రియాన్ష్ కు కోటి రూపాాయలు కూడా రావని ఫ్రెండ్స్ ఎగతాళి చేయడాన్ని వెల్లడించాడు. ప్రియాన్ష్ ఆర్య కు వేలంలో మంచి డబ్బు వస్తుందని తాను ఎప్పుడూ నమ్మానని చెప్పుకొచ్చాడు. కానీ కోటి రూపాయలకు మించి రావని తన స్నేహితులు మాట్లాడారంటూ ప్రియాన్ష్ తనతో చెప్పాడన్నాడు. కానీ ప్రియాన్ష్ కు కనీసం 2.70 కోట్లు వస్తాయని అతని తండ్రితో తాను చెప్పిన విషయాన్ని సంజయ్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు. మెగా వేలంలో 30 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న ప్రియాన్ష్ ఆర్యను పంజాబ్ కింగ్స్ 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.