Allu Arjun Happy Birthday : గంగోత్రి నుంచి పుష్ప దాకా… తగ్గేదేల్యా

ఐదు లక్షలు ఇస్తామంటే నాలుగు లక్షలు సాలంటావేంటీ తెలివి తక్కువగా...’ ‘అది కూలీ... ఇది వాటా... యజమానినైపోలా... ఇది సినిమాలో పుష్ప లెక్క.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 11:00 AMLast Updated on: Apr 08, 2024 | 11:00 AM

From Gangotri To Pushpa Will It Decrease

 

 

ఐదు లక్షలు ఇస్తామంటే నాలుగు లక్షలు సాలంటావేంటీ తెలివి తక్కువగా…’ ‘అది కూలీ… ఇది వాటా… యజమానినైపోలా… ఇది సినిమాలో పుష్ప లెక్క. మరి సూపర్‌స్టార్లూ నటసార్వభౌములూ ఎందరో ఉన్న తన కంటూ కొన్ని పేజీలు రాసుకున్నాడు పుష్ప. అందుకే తగ్గేదేలే అన్నాడుగా దూసుకుపోతున్నాడు. ఏళ్ల తరబడి ఊరించిన ఉత్తమనటుడి అవార్డునే పట్టి తెచ్చేశాడు..! అభిమానులందరినీ పార్టీ చేసుకోమన్నాడు. పట్టుమని పాతిక సినిమాలతోనే స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా మారిన బన్నీ బర్త్ డే నేడు.

అల్లు అర్జున్‌ 2.0 (Allu Arjun 2.0) ఈ సినిమా ఎప్పుడొచ్చిందీ అంటారా… ఇప్పుడు మనం చూస్తున్నది అతడి రెండో అవతారాన్నే. స్టైలిష్‌ స్టార్‌గా బన్నీని చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇటీవల వచ్చిన పుష్ప-2 (Pushpa-2) ఫస్ట్‌ లుక్‌లో గంగ జాతరలో స్త్రీ వేషంలో ఉన్న అర్జున్‌ని చూసి అవాక్కయ్యారు అభిమానులు. అసలు పుష్ప పాత్రే ఒక సంచలనం అనుకుంటే పుష్ప-2 మరో సంచలనం. ఒక తెలుగు హీరో అదీ స్టైలిష్‌ స్టార్‌గా పేరొందిన హీరో… ఇంత డీగ్లామర్‌ పాత్ర చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. అది అల్లు అర్జున్‌కి పుష్కలంగా ఉంది. అతడు తనని తాను స్టార్‌ అనుకోడు. ఇమేజ్‌ చట్రంలో అస్సలు ఇరుక్కోడు. హీరోలా నటించాలనుకోడు. నటించి హీరో అవ్వాలనుకుంటాడు. అందుకే… దర్శకుడు చెప్పిన పాత్రలో లీనమైపోతాడు. పాత్రకోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతాడు.

లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడిగా, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అల్లు అర్జున్. హీరోగా లాంచ్ అవ్వడానికి ముందే పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ‘విజేత’ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన బన్నీ.. ‘స్వాతిముత్యం’ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక 18 ఏళ్ళ వయసులో ‘డాడీ’ మూవీలో డాన్సర్ గా నటించి, అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తరువాత 2003 లో ‘గంగోత్రి’ సినిమాతో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అల్లు అర్జున్ హీరోగా డెబ్యూట్ చేశాడు.

టాలీవుడ్ లో తొలి అడుగే సక్సెస్ ఫుల్ గా వేసిన అల్లు వారబ్బాయి.. సినిమా సినిమాకి నటన పరంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘ఆర్య’ చిత్రం అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయ్యేలా చేసింది. వీవీ వినాయక్ తో కలిసి చేసిన ‘బన్నీ’ పర్వాలేదనిపించగా.. కరుణాకరన్ డైరెక్షన్ లో నటించిన ‘హ్యపీ’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘దేశముదురు’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడమే కాదు.. అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ ను, స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది.

‘పరుగు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన బన్నీ.. ‘ఆర్య 2’ తో స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ని సుస్థిరం చేసుకున్నారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుడు, బద్రీనాథ్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ‘వేదం’ చిత్రం నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘జులాయి’ మూవీ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఇక ‘ఎవడు’ చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

2014 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘రేసుగుర్రం’ బన్నీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఇది ఆయనకు ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీగా చెప్పబడింది. ఆ తరువాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. సరైనోడుతో ఊర మాస్ అంటే ఏంటో చూపించాడు. ఈ క్రమంలో రుద్రమదేవి చిత్రంలో గెస్టుగా చేసిన స్టైలిష్ స్టార్.. ‘డీజే: దువ్వాడ జగన్నాధం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ వెంటనే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసింది. దీంతో రెండేళ్ల గ్యాప్ తీసుకుని ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ తెలియజెప్పాడు. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేశాడు.

అల.. తరువాత వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ తో కలసి చేసిన ఈ హ్యాట్రిక్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మారడమే కాదు, సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన గ్లింమ్స్ & ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.

అల్లు అర్జున్ ‘ఆర్య’ నుంచి ప్రతీ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తూ మార్కెట్ ను విస్తరించుకున్నాడు. ముఖ్యంగా కేరళలో మలయాళ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. తమిళంలోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ పాన్ ఇండియా వైడ్ మార్కెట్ మీద దృష్టి సారించి సక్సెస్ అయ్యాడు. ఇప్పటి వరకూ అల్లు అర్జున్ 3 నంది అవార్డులు, పలు ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులతో పాటు ఒక ఐఫా ఉత్సవ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ‘పుష్ప’ తర్వాత పలు పాపులర్ మ్యాగజైన్స్ కవర్ పేజీల మీదకి ఎక్కాడు బన్నీ. అంతేకాక జాతీయ అవార్డును అందుకుని ఇండస్ట్రీలో బెంజ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలా టాలివుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కెరీర్ ఇలానే సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటూ.. మరోసారి బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది డైయిల్ న్యూస్ ఛానెల్ .