జాక్ పాట్ ఎవరికో ? విదేశీ ప్లేయర్స్ కు ఫుల్ డిమాండ్
ఐపీఎల్ మెగావేలం కోసం ఇటు ఫ్రాంచైజీలు, అటు ప్లేయర్స్ తో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరివారంలో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆక్షన్ జరగబోతోంది.
ఐపీఎల్ మెగావేలం కోసం ఇటు ఫ్రాంచైజీలు, అటు ప్లేయర్స్ తో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరివారంలో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆక్షన్ జరగబోతోంది. స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ వేలం బరిలో ఉండడంతో ఎవరు జాక్ పాట్ కొడతారో అన్న ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. 2 కోట్లబేస్ ప్రైస్ లో ఉన్న కొందరు విదేశీ ప్లేయర్లకు భారీ డిమాండ్ నెలకొంది. మెగా వేలంలో వాళ్లపై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జాస్ బట్లర్ కోసం పలు ఫ్రాంచైజీలు బిడ్ వేసేందుకు పోటీపడుతున్నాయి. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన బట్లర్ గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొట్టాడు. సారథిగా, బ్యాటర్ గానే కాకుండా వికెట్ కీపర్ గానూ అత్యుత్తమ నైపుణ్యం ఉన్న ఆటగాడు కావడంతో సహజంగానే ఫ్రాంచైజీలు కన్నేశాయి. 2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్న బట్లర్ 2022 సీజన్‌లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తన విధ్వంసంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా ఉన్న బట్లర్‌కు వేలంలో భారీ డిమాండ్ నెలకొంది. ఇప్పటి వరకూ 107 ఐపీఎల్ మ్యాచ్ లలో ఏకంగా 7 సెంచరీలు బాదిన బట్లర్ 3582 పరుగులు చేశాడు. తాజాగా విండీస్ తో టీ20 సిరీస్‌లో బట్లర్ దూకుడైన బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్నాడు.
అలాగే ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కోసం గట్టిపోటీ ఖాయంగా కనిపిస్తోంది. 2023లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సాల్ట్ గత సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. గ182.01 స్ట్రైక్‌రేటుతో 435 పరుగులు చేసినా రిటెన్షన్ లో ఛాయిస్ లేక అతన్ని కోల్ కత్తా వేలంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఇటీవల విండీస్ తో టీ ట్వంటీ సిరీస్ లోనూ శతకం బాదాడు. గత కొన్ని నెలలుగా షార్ట్ ఫార్మాట్ లో దుమ్మురేపుతున్న సాల్ట్ కోసం కోల్ కత్తా ఆర్టీఎం ఉపయోగిస్తుందన్న అంచనాలున్నాయి.
మరోవైపు ముగ్గురు విదేశీ బౌలర్లపైనా కోట్ల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ మినీ వేలంలో ఏకంగా 24.75 కోట్లు పలికాడు. ఈ సారి మెగా ఆక్షన్ లో స్టార్క్ మరోసారి భారీ ధరకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు. కోల్ కత్తా టైటిల్ విజయంలో స్టార్క్ కూడా కీలకపాత్ర పోషించాడు. తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటకీ కీలక మ్యాచ్‌ల్లో తానెంతటి విలువైన బౌలరో నిరూపించాడు. ఇక సౌతాఫ్రికాకు చెందిన ఇద్దరు పేసర్ల కోసం గట్టి డిమాండ్ కనిపిస్తోంది. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబాడపై పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రబాడ. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు.. 2019లో 25 వికెట్లతో చెలరేగిన ఈ సఫారీ పేసర్ 2020లో 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. నిలకడగా రాణిస్తున్న రబాడ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడే అవకాశముంది.
అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌లో అందరి దృష్టి ఆకర్షించిన దక్షిణాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ కూడా ఈ వేలంలో జాక్ పాట్ కొట్టే ఛాన్సుంది. గత వేలంలో ఈ యంగ్ బౌలర్ ను ముంబై ఇండియన్స్ 5 కోట్లకు సొంతం చేసుకుంది. అనుకున్నంతగా అంచనాలు అందుకోలేకపోవడంతో ముంబై అతన్ని వదిలేసింది. ఇటీవల మళ్ళీ ఫామ్ అందుకున్న కొయెట్జీ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటుతున్నాడు. దీంతో అతని కోసం కూడా ఫ్రాంచైజీలు హోరాహోరీ తలపడే ఛాన్సుంది.