డ్రా దిశగా గబ్బా టెస్ట్, ఫాలో ఆన్ తప్పించిన టెయిలెండర్లు
వర్షం అంతరాయం కలిగిస్తూ.. ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తున్న గబ్బా టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. టెయిలెండర్లు అద్భుతంగా పోరాడడంతో తృటిలో ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. జడేజా కీలక ఇన్నింగ్స్ కు తోడు చివర్లో బూమ్రా, ఆకాశ్ దీప్ పట్టుదలగా ఆడి ముప్పును తప్పించారు.
వర్షం అంతరాయం కలిగిస్తూ.. ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తున్న గబ్బా టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. టెయిలెండర్లు అద్భుతంగా పోరాడడంతో తృటిలో ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. జడేజా కీలక ఇన్నింగ్స్ కు తోడు చివర్లో బూమ్రా, ఆకాశ్ దీప్ పట్టుదలగా ఆడి ముప్పును తప్పించారు. మధ్యలో వర్షం అడ్డుపడడంతో నాలుగోరోజు ఆటకు తెరపడింది. ఒక దశలో టీమిండియాకు ఫాలో ఆన్ తప్పదనిపించింది. 44 పరుగులకే 4 వికెట్లు, 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పోరాటం జట్టు ను ఆదుకుంది. ఆ తర్వాత జడేజా కీలకమైన సమయంలో ఔటైనా.. చివరి వికెట్ పడకుండా బుమ్రా, ఆకాశ్ దీప్ చేసిన పోరాటం అద్భుతమనే చెప్పాలి. వర్షం వల్ల తరచూ అంతరాయాలు కలుగుతున్న ఈ టెస్టులో టీమిండియాను కచ్చితంగా ఫాలో ఆన్ ఆడిస్తే గెలవచ్చని ఆస్ట్రేలియా నమ్మకం పెట్టుకుంది.
కానీ కంగారూల ఆశలపై బుమ్రా, ఆకాశ్ దీప్ జోడీ నీళ్ళు చల్లారు. ఊహించని విధంగా ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. ఈ ఇద్దరూ చివరి వికెట్ కు అజేయంగా 39 పరుగులు జోడించారు. దీనిలో ఆకాశ్ దీప్ 27 రన్స్ చేయగా.. 2 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. బుమ్రా కూడా 10 పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు.వీళ్లిద్దరూ వికెట్ కాపాడుకోవడంతో ఫాలో ఆన్ గండం గట్టెక్కడానికి కావాల్సిన 246 పరుగుల మార్క్ ను టీమిండియా అందుకుంది. ఆ స్కోరు దాటగానే ఆకాశ్ దీప్ ఓ భారీ సిక్స్ కూడా కొట్టాడు. ఆ సమయంలో వెలుతురు సరిగా లేదంటూ ఆటను నిలిపేశారు. దీంతో నాలుగో రోజు ముగిసే సమయానికి ఇండియన్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 252 రన్స్ చేసింది. ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది.
కాగా ప్రస్తుత పరిస్థుతుల్లో బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. వర్షం కారణంగా ఇప్పటికే తొలి రోజు ఆట 90 శాతానికిపైగా తుడిచిపెట్టుకుపోయింది. తర్వాతి మూడు రోజులు కూడా వరుణుడు తరుచూ అడ్డుపడుతూనే ఉన్నాడు. దీంతో నాలుగు రోజులు కలిపి కేవలం 191 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. చివరి రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిందే. చివరి రోజు ఇండియన్ టీమ్ చివరి వికెట్ ను త్వరగా తీసి.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసి రోహిత్ సేనకు కంగారూలు సవాలు విసురుతారా లేక మ్యాచ్ డ్రా కోసమే ఆడతారా అన్నది చూడాలి.