Devan Reddy: వైసీపీకి మరో షాక్.. గాజువాక ఇంఛార్జి రాజీనామా..

విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ తిప్పల దేవన్ రెడ్డి కూడా సోమవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దేవన్ రెడ్డి.. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 04:35 PMLast Updated on: Dec 11, 2023 | 4:42 PM

Gajuwaka Ysrcp Co Ordinator Devan Reddy Resigned To Party

Devan Reddy: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ తిప్పల దేవన్ రెడ్డి కూడా సోమవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దేవన్ రెడ్డి.. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు.

Alla Ramakrishna Reddy: రాజీనామా వెనక! ఆళ్ల రాజీనామాకు ఆయనే కారణమా.. అసలేం జరిగింది ?

తిప్పల నాగిరెడ్డి 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై 16,753 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాతి కాలంలో దేవన్ రెడ్డిని గాజువాక వైసీపీ కో ఆర్డినేటర్‌గా నియమించింది పార్టీ అధిష్టానం. ఆయన గాజువాకలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. అలాంటిది ఉన్నట్లుండి దేవన్ రెడ్డి పార్టీని వీడటం సంచలనంగా మారింది. ఆయన పార్టీ మారబోతున్నట్లు తెలుస్తోంది. తనయుడి రాజీనామాపై తండ్రి, ఎమ్మెల్యే నాగిరెడ్డి ఇంకా స్పందించలేదు. కొద్ది రోజుల తర్వాత ఆయన కూడా పార్టీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీని రాజీనామాలు, తిరుగుబాట్ల అంశం కలవరపెడుతోంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేయడం, మరికొందరు కూడా పార్టీకి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుండటంతో వైసీపీలో గందరగోళం నెలకొంది. అయితే, పార్టీని వీడుతున్న వాళ్లను అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఎలాంటి బుజ్జగింపు ప్రయత్నాలు చేయడం లేదు. వైసీపీలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ స్పందించకపోవడానికి కారణం ఉందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు కేటాయించాలనుకోవడమే దీనికి కారణమనే వాదన ఉంది.