పాంటింగ్ నోర్మూసుకో, గంభీర్ దిమ్మతిరిగే కౌంటర్
న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై టీమిండియా ఓటమి ఇప్పటికీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మూడు టెస్టుల్లోనూ ఓడిపోవడంతో అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విదేశీ క్రికెటర్లయితే ఇష్టానుసారం మాట్లాడేశారు.
న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై టీమిండియా ఓటమి ఇప్పటికీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మూడు టెస్టుల్లోనూ ఓడిపోవడంతో అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విదేశీ క్రికెటర్లయితే ఇష్టానుసారం మాట్లాడేశారు. పనిలో పనిగా కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ ఫామ్ తోనే ఈ పరాజయానికి కారణమన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ముఖ్యంగా కోహ్లీపై పాంటింగ్ సెటైర్లు వేశాడు. గత నాలుగేళ్లలో టెస్టుల్లో కోహ్లి రెండు సెంచరీలే చేశాడంటూ విమర్శించాడు. కోహ్లి స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యేవాడని కఠిన వ్యాఖ్యలు చేశాడు. ఫేమ్‌తో జట్టులో కొనసాగుతున్నాడని పరోక్షంగా విమర్శించాడు. దీనిపై గంభీర్ ఘూటుగా స్పందించాడు. అసలు భారత క్రికెట్‌కు రికీ పాంటింగ్‌కు సంబంధం ఏంటిని గౌతీ ప్రశ్నించాడు. అతను ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకోవాలని సూచించాడు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి తాము ఎలాంటి ఆందోళన చెందట్లేదన్నాడు. వాళ్లు ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లని మద్ధతిచ్చాడు. గత సిరీస్ ఫలితంతో వారిద్దరిలో మరింత కసి రగులుతోందనీ గంభీర్ వెల్లడించాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ కఠిన సవాళ్లకు సమర్థవంతంగా ఎదురీదగల సత్తా ఉన్నవాళ్లని చెప్పాడు.. భారత క్రికెట్ తరఫున ఎన్నో విజయాలు సాధించారనీ, భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతారని గంభీర్ తేల్చేశాడు. ఇకనైనా పాంటింగ్ తన టీమ్ సంగతి చూసుకుంటే బాగుంటుందంటూ గౌతీ గట్టి కౌంటరే ఇచ్చాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్‌కు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం. కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. నిజానికి కివీస్ తో సిరీస్ ముందు వరకూ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియానే టాప్.. కానీ ఆ సిరీస్ లో వైట్ వాష్ పరాభవం భారత్ కొంపముంచింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి దూసుకెళ్ళింది.