పుజారా కోసం గంభీర్ పట్టు, నో చెప్పిన సెలక్టర్లు
కొత్త ఏడాదిలో కీలక మ్యాచ్ కు భారత్ రెడీ అవుతోంది. సిరీస్ ను సమం చేయాలంటే సిడ్నీ టెస్టులో గెలవాల్సిందే... బాక్సింగ్ డే టెస్టులో ఓటమి తర్వాత ఇటు సీనియర్ ప్లేయర్స్, అటు హెడ్ కోచ్ గంభీర్ పై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కొత్త ఏడాదిలో కీలక మ్యాచ్ కు భారత్ రెడీ అవుతోంది. సిరీస్ ను సమం చేయాలంటే సిడ్నీ టెస్టులో గెలవాల్సిందే… బాక్సింగ్ డే టెస్టులో ఓటమి తర్వాత ఇటు సీనియర్ ప్లేయర్స్, అటు హెడ్ కోచ్ గంభీర్ పై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బ్యాటర్ల ఆటతీరుపై డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ సీరియస్ క్లాస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే బ్యాటింగ్ లో పుజారా,రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్టులు లేకపోవడం ఆసీస్ టూర్ లో మైనస్ గా మారిందన్నది ఇప్పటికే చాలా మంది తేల్చేశారు. ఇదే విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న గంభీర్ టెస్ట్ స్పెషలిస్ట్, వెటరన్ ప్లేయర్ చటేశ్వర్ పుజారాపై దృష్టి సారించాడు. అయిదో టెస్ట్ మ్యాచ్ ఆడే తుదిజట్టులో అతనికి చోటు కల్పించాలని భావిస్తోన్నాడు. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్లతోనూ మంతనాలు సాగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
టాప్ ఆర్డర్ విఫలమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుజారా జట్టులో ఉంటే బాగుంటుందని గంభీర్ చెప్పినట్టు తెలుస్తోంది. పుజారాను జట్టులోకి తీసుకోవాలంటూ గౌతమ్ గంభీర్.. సెలెక్టర్లను కోరాడని, దీనికి వాళ్లు అంగీకరించలేదని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. టెస్ట్ మ్యాచ్‌లల్లో అతనికి ఉన్న అపార అనుభవాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడినప్పటికీ- సెలెక్టర్లు మాత్రం పట్టించుకోలేదని సమాచారం. టీమిండియా తరఫున వందకు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం పుజారాకు ఉంది. అయితే 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ తరువాత అతను జట్టుకు దూరమయ్యాడు. కానీ గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయంలో పుజారా కీలకపాత్ర పోషించాడు. కొన్ని ఇన్నింగ్స్ లలో ఆసీస్ బౌలర్లకు ఓ రేంజ్ లో చికాకు తెప్పించాడు. గబ్బాలో అయితే 211 బంతులాడి 56 పరుగులతో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ సారి పుజారా, రహానే లాంటి ప్లేయర్స్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. సీనియర్ ప్లేయర్స్ తో పాటు యువ ఆటగాళ్ళు సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోతున్నారు. సుధీర్ఘమైన ఇన్నింగ్స్ లు ఆడే ఓపిక వారిలో కనిపించడం లేదు. అందుకే పుజారాను చివరి టెస్టులోకి తీసుకోవాలని గంభీర్ భావించినా… సెలక్టర్లు ఒప్పుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.