గంభీర్ ఒక ఛీటర్, రెచ్చిపోయిన మాజీ క్రికెటర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై బెంగాల్ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2025 | 12:53 PMLast Updated on: Jan 10, 2025 | 12:53 PM

Gambhir Is A Cheater Says Ex Cricketer

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై బెంగాల్ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3తో ఓటమి తర్వాత పలువురు మాజీ క్రికెటర్లు గంభీర్ కోచింగ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనోజ్ తివారీ కూడా స్పందించాడు. గంభీర్ చెప్పిన వాటినే పాటించడని విమర్శించాడు. ఐపీఎల్లో కలిసి పనిచేసిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లను ఏరికోరి తన టీమ్ లోకి తీసుకువచ్చాడని, వారేం చేశారని తివారీ ప్రశ్నించాడు. జట్టు కోసం ఎవ్వరూ బాగా ఆడినా క్రిడిట్ మాత్రం తనకే దక్కాలన్నది గంభీర్ లక్ష్యమని ఫైర్ అయ్యాడు.

గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ విజయాల కోసం తాను కల్లిస్, నరైన్ లాంటి ఆటగాళ్లు ఎంతో కష్టపడితే క్రెడిట్ మాత్రం గంభీర్ తీసుకున్నాడని మండిపడ్డాడు. గంభీర్ ఒక్కడే కోల్‌కతా టీమ్ ను టైటిల్‌ వరకు నడిపించలేదన్నాడు. దాని వెనుక అందరి కృషి ఉందని మనోజ్ తివారీ చెప్పాడు. కానీ గంభీర్ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడడని, అతనో మోసగాడంటూ విమర్శలు గుప్పించాడు. ఇదిలా ఉంటే కోచ్ గంభీర్ , కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం వల్లనే భారత్ ఓడిపోయిందని తివారీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే జట్టు వాతావరణం చెడిందన్నాడు.

గంభీర్, రోహిత్ కు అసలు పోలికే లేదన్నాడు. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ అయితే గంభీర్ విజయం కేవలం ఐపీఎల్ టైటిల్ గెలవడానికి మాత్రమే పరిమితమయ్యాడని వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ కలిసి పనిచేయడం కష్టమేనంటూ తివారీ చెప్పుకొచ్చాడు. అయితే మనోజ్ తివారీ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గంభీర్ తో అతనికి గొడవలు జరిగాయని, ఈ కారణంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటూ కొందరు చెబుతున్నారు. 2015లో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అప్పటి బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీతో గౌతమ్ గంభీర్ గొడవపడ్డాడు. దీని తర్వాత గంభీర్‌కు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించారు.