రిటైర్మెంట్ పై యూటర్న్, రోహిత్ పై గంభీర్ అసంతృప్తి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పెద్ద చర్చే జరిగింది. దాదాపు ఏడాదికి పైగా పేలవ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఇక టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే టైమ్ వచ్చిందన్న అభిప్రాయం గట్టిగానే వినిపించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పెద్ద చర్చే జరిగింది. దాదాపు ఏడాదికి పైగా పేలవ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఇక టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే టైమ్ వచ్చిందన్న అభిప్రాయం గట్టిగానే వినిపించింది. కెప్టెన్ కాబట్టే జట్టులో కొనసాగుతున్నాడంటూ కొందరు మాజీలు సెటైర్లు కూడా వేశారు. మెల్ బోర్న్ టెస్ట్ సమయంలో రోహిత్ కూడా దీనిపై స్పందించాడు. తాను రిటైర్ కావడం లేదంటూ స్పష్టం చేశాడు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగా చోటు చేసుకున్న కొన్ని కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక దశలో రిటైర్మెంట్ పై రోహిత్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. నాలుగో టెస్టు అనంతరం హిట్‌మ్యాన్ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది. మెల్‌బోర్న్ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడనీ, కానీ, సన్నిహితులు అతని మనసును మార్చారని కథనం ద్వారా వెల్లడైంది. లేదంటే ఆస్ట్రేలియా పర్యటనలో మరో రిటైర్మెంట్‌ను చూసేవాళ్లమంటూ హిట్ మ్యాన్ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ మధ్య సంబంధాలు బాగా లేవని కూడా జాతీయ మీడియా కథనం ప్రచురించింది. జట్టు కూర్పు నుంచి మైదానంలో వ్యూహాల వరకు విబేధాలు తలెత్తినట్టు తెలిపింది. రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోవడంతో టెస్టులకు గుడ్ బై చెప్పాలని రోహిత్ అనుకున్నప్పటకీ… గంభీర్ తో సమన్వయం కుదరకోవడం, పదేపదే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. కానీ అతని శ్రేయాభిలాషులు, కుటుంబసభ్యులు రోహిత్ ను వారించారని సమాచారం. ఈ కారణంగానే రిటైర్మెంట్ పై రోహిత్ యూటర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో గంభీర్ రోహిత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్ పై మళ్ళీ వెనక్కి తగ్గడం గంభీర్ కు నచ్చలేదు. ఇక రోహిత్ మాత్రం టెస్టుల్లో కొనసాగేందుకే డిసైడయ్యాడు. గంభీర్ అసంతృప్తిగా ఉండడంతో హిట్ మ్యాన్ సిడ్నీ టెస్ట్ నుంచి తనంతట తానుగానే వైదొలిగాడు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే, అతని కెప్టెన్సీలో భారత్ గత 8 టెస్టుల్లో ఆరింట ఓడింది. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంపై బీసీసీఐ చేసిన రివ్యూ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓవరాల్ గా గంభీర్, రోహిత్ మధ్య విభేదాలున్నట్టు తేలిపోయిన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.