GAUTAM ADANI: అదానీకా బిజినెస్ మహోత్సవ్..!
మన దేశంలో ఎటు చూసినా ఒకప్పుడు అంబానీ పేరు వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు దీనికి మరో పేరు జత కట్టింది అదే అదానీ. 1988లో అదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ అనే ఎగుమతులు, దిగుమతులతో వ్యాపారరంగంలో తొలి అడుగును పెట్టింది. అయితే ఇప్పుడు ఆ 35 సంవత్సరాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పలురంగాల్లో విస్తరింపజేశారు. అప్పట్లో పి వి నరసింహరావు పుణ్యమా అని 1991లో లిబరలైజేషన్ లో భాగంగా ఆర్థిక సంస్కరణలు కలిసి రావడంతో వ్యవసాయ, విద్యుత్ ఉత్పత్తుల పై పెను విప్లవం సృష్టిస్తూ అంచలంచలుగా పైకి ఎగబాకారు. ఈ మూడున్నర దశాబ్దకాలంగా ఎదగడం ఒక ఎత్తైతే.. మోదీ ప్రధాని అయిన ఎనిమిదేళ్లలో అదానీ వ్యాపారం, రాబడి అనూహ్యంగా పెరిగింది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే అదానీ ఆయనకు మంచి ఆప్తుడని కొన్ని పత్రికలు వెలువరించాయి.
2018లో భారత ప్రభుత్వం ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు రంగానికి అప్పగించాలని నిర్ణయించింది. వాటి బిడ్డింగ్ నిబంధనలపై కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కకు నెట్టి ‘పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ)’ ఆ ఆరు ఎయిర్‌పోర్టులనూ అదానీకి కట్టబెట్టేలా వ్యవహరించడం గమనించవల్సిన అంశం. ఈ ఆరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుల్లో రెండుకు మించి విమానాశ్రయాలను ఒకే బిడ్డర్‌కు ఇవ్వకూడదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం సూచించింది. అలా ఒక్కరికే ఇస్తే పనితీరు పై సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, వేర్వేరు బిడ్డర్లకు ఇవ్వడం వల్ల పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని అందుకే సామర్థ్యం ఉన్నా జీఎంఆర్‌కు ఇవ్వలేదని గుర్తుచేసింది. ఏ అనుభవం లేని వారు కూడా బిడ్లు వేయవచ్చని పీపీపీఏసీకి నేతృత్వం వహించిన డీఈఏ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు. ఆ తరువాత అతనిని ఆ శాఖనుంచి బదిలీ విద్యుత్ శాఖకు ఆతరువాత ఏపి ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్‌ను వెనువెంటనే నియమించారు. అప్పటికే అనుభవం లేకుండా ఈ ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి అతిపెద్ద బిడ్డర్‌గా అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నిలిచినట్టు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది. ఆ ఆరు ఎయిర్‌పోర్టులనూ అదానీకి ఇవ్వడం కోసమే.. ఎలాంటి అనుభవం లేనివారు కూడా బిడ్లు వేసేలా నిబంధనలను సైతం ప్రభుత్వం రూపొందించిందని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే త్రివేండ్రం ఎయిర్‌పోర్టు నిర్వహణకు సంబంధించి 50 సంవత్సరాల లీజును అదానీ దక్కించుకోవడంపై నాటి కేరళ ఆర్థిక మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించడాన్ని.. మోదీ సర్కారు ‘సిగ్గులేకుండా చేపట్టిన ఆశ్రిత పక్షపాత చర్య’గా అభివర్ణించారు.
ఇలా పలు రకాల టెండర్లను దక్కించుకోవడం ద్వారా ఈ ఎనిమిది సంవత్సరాల్లో అదానీ ఆస్తులు 230 శాతానికి పైగా పెరిగినట్లు సమాచారం. 20వ శతాబ్దంలో అమెరికాలో ఇలాగే రాజకీయ సంబంధాల ద్వారా జాన్ డి అనే పారిశ్రామిక వేత్త రాక్‌ఫెల్లర్ (అమిత సంపన్నుడి)గా ఎదిగారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఇంధన నిపుణుడు టిమ్ బక్లే … ‘మోదీస్ రాక్ ఫెల్లర్’గా గౌతమ్ అదానీని అభివర్ణించారు. మన దేశంలోనే కాకుండా ఈ అదానీ వ్యాపార వృక్షం వేర్లు విదేశాలలో కూడా పాతుకుపోయాయి. 2015 జూన్‌లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో తొలిసారి పర్యటించినప్పుడు.. భారతదేశానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు బంగ్లాదేశ్‌కు విద్యుత్తు విక్రయించేలా 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు బంగ్లాదేశ్ విద్యుత్తు శాఖ.. అదానీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో దాన్ని రెండు దేశాలకూ ‘విన్-విన్’ ఒప్పందంగా అందరూ కీర్తించారు. అయితే ఇందులోని లొసుగులను వింటే అందరూ షాక్ కి గురి అవ్వల్సిందే. అదానీ గ్రూప్‌తో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న 163 పేజీల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను ఇటీవలే ముగ్గురు నిపుణులతో పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ ప్రాజెక్టు వల్ల బంగ్లాదేశ్‌కు పెద్దగా లాభం లేదని.. పైగా అదానీ ప్లాంటు విద్యుత్తును ఉత్పత్తి చేసినా, చేయకున్నా బంగ్లాదేశ్ సర్కారు ఆ గ్రూప్ కు ఏటా 450 మిలియన్ డాలర్లు నిర్వహణ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుందని ఆ కథనం సారాంశం. అదే కోవలో శ్రీలంకలో ఒక విద్యుత్తు ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలంటూ మోదీ శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారంటూ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ అక్కడి పార్లమెంటరీ బోర్డు ముందు చెప్పడం సంచలనం అయ్యింది. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాక తన పదవికి రాజీనామా కూడా చేశారు.
మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ గడచిన రెండేళ్లలో అదానీ గ్రూపులోని ఏడింట ఐదు కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఆ ఐదు కంపెనీలూ.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్. ఈ ఐదు కంపెనీల్లో 2020 నుంచి 2022 సెప్టెంబరు 30 నాటికి ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు దాదాపు 9.5 బిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు రూ.77 వేల కోట్లు ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే దేశంలోని మ్యూచువల్‌ఫండ్స్ సంస్థలన్నీ కలిపి ఆ ఐదు సంస్థల షేర్లపై పెట్టిన పెట్టుబడుల కన్నా ఇది ఐదు రెట్లు అధికం. ప్రభుత్వ అనుమతి లేనిదే వీలుకాని ఎన్నో అసాధ్యాలు అదానీ విషయంలో అతి సులభంగా సాధ్యమైపోతుండడం వల్లే క్రోనీ క్యాపిటలిజం అంటే డబ్బులున్న వారే మళ్లీ పెట్టుబడులు పెట్టి ధనవంతులు అవ్వడం. ఒకరి దగ్గరే పెట్టుబడులు నిలువ ఉండటం అనే పరిస్థితులు మన దేశంలో పేట్రేగిపోయింది.
ఇంతటి విస్తారమైన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన అదానీ కంపెనీలు విషయానికొస్తే చాలానే ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో దేశంలోనే అతిపెద్ద బొగ్గు వాణిజ్య సంస్థగానే కాకండా దేశంలోనే అగ్రశ్రేణి ఎయిర్ పోర్టులు నిర్వహణ చూసుకునే సంస్థగా చలామణి అవుతున్నారు. మరోకటి అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. అలాగే అదానీ ట్రాన్స్‌మిషన్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఇంకా అదానీ విల్మర్, అదానీ టోటల్ గ్యాస్ అనే పేరుతో దేశంలోనే అతిపెద్ద వంటనూనెల బ్రాండ్లు, అతి పెద్ద ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ సంస్థగా ప్రాచుర్యం పోందింది. చివరగా అదానీ పవర్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థగానూ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అంటే 13 పెద్ద పెద్ద పోర్టులను నిర్వహణ చేపడుతున్న భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్. ఒకటా రెండా సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అన్నట్లు అదాని అడుగిడని వ్యాపారం లేదు అని చెప్పాలి.