SCHEDULE FEAR : ఇదేం షెడ్యూల్ రా నాయనా.. కోట్లు ఖర్చయిపోతున్నయ్
సార్వత్రిక ఎన్నికల (General Elections) నగారా మోగడంతో... పార్టీలకు కొత్త టెన్షన్ పెట్టుకుంది. నిన్న మొన్నటి దాకా షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అంటూ... ఎదురుచూసిన వారంతా ఆందోళనలో పడిపోయారు. షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్ మధ్య సుదీర్ఘ సమయం ఉండటమే ఇందుక్కారణం.
సార్వత్రిక ఎన్నికల (General Elections) నగారా మోగడంతో… పార్టీలకు కొత్త టెన్షన్ పెట్టుకుంది. నిన్న మొన్నటి దాకా షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అంటూ… ఎదురుచూసిన వారంతా ఆందోళనలో పడిపోయారు. షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్ మధ్య సుదీర్ఘ సమయం ఉండటమే ఇందుక్కారణం. షెడ్యూల్ రోజు నుంచి పోలింగ్ వరకు 59 రోజులు టైమ్ ఉండటంతో అభ్యర్థుల ఖర్చు తడిసిమోపెడు అవనుంది. క్యాంపెయిన్ నుంచి పంపకాల దాకా కోట్లకు కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. జాతీయ పార్టీల (National parties) తో పాటు ప్రాంతీయ పార్టీలు…అభ్యర్థుల ప్రకటనలో బిజీ అయ్యాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తే…ఇంకొన్ని పార్టీలు సర్వేలు, వడపోతలు చేస్తున్నాయి. ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న క్యాండిడేట్లు… ప్రచారాన్ని షురూ చేశారు. పార్టీ కేడర్, తమ అనుచరులతో గ్రామాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ఎప్పుడు వస్తుంది ? నామినేషన్లు ఎపుడు వేయాలి ? ప్రచార సామాగ్రిని ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి అంటూ నానా హైరానా పడ్డారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. 543 పార్లమెంట్ స్థానాలకు…ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా…ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుండటంతో బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొన్నటి దాకా షెడ్యూల్ కోసం ఎదురుచూసిన వారంతా…ఇప్పుడు ఎన్నికల ప్రక్రియపై నీళ్లు నములుతున్నారు.
2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో 25 ఎంపీ సీట్లు, తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లకు…మార్చి10న షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి నామినేషన్ల స్వీకరించగా… ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. 2024లో ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లకు మార్చి 16న షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు స్వీకరణ జరగనుండగా…మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. 2019లో షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి 33 రోజుల్లోనే పోలింగ్ ముగిసింది. ఈసారి మాత్రం 59 రోజులు సమయం ఉంది. పోయిన సారి పోలింగ్ త్వరగా ముగిస్తే…ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ 2024లో షెడ్యూల్ ప్రకటనకు…పోలింగ్‌కు గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థుల గుండెల్లో వణుకు మొదలైంది. పార్టీలు, అభ్యర్థులు కూడా…గతంలో లాగానే త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావించారు. మొదటి రెండు దశల్లోనే పోలింగ్ ఉంటుందని అనుకున్నారు. ఈసారి ఏపీ అసెంబ్లీ, రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటే… ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. జూన్ 6 కి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది.
నోటిఫికేషన్ నుంచి పోలింగ్ మధ్య దాదాపు రెండు నెలల టైమ్ ఉండటంతో…అన్ని పార్టీ అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. 60 రోజుల పాటు పార్టీ కేడర్‌ను కాపాడుకోవాలన్నా… క్యాంపెయిన్ చేయాలన్నా… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. గత ఎన్నికలు 33 రోజుల్లోనే ముగిస్తే… ఈసారి రెండు నెలల సమయం పడుతోంది. అప్పటిదాకా పార్టీలతో పాటు అభ్యర్థుల చేతికి చమురు భారీగానే వదులుతుంది. క్యాంపెయిన్‌తో పాటు కేడర్ కాపాడుకోడానికి… మెయింటెనెన్స్ ఖర్చులు రోజుకు కనీసం కోటి రూపాయలు పెట్టుకోవాల్సిందేనని ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. ప్రచార ఖర్చు, ర్యాలీలు ఓ ఎత్తయితే… ఆ తర్వాత అనుచరులకు మందు, భోజనాలు వారి ఖర్చులు… మాములుగా ఉండదు. ఓటర్లకు కూడా… కాదు లేదు అనకుండా మందు పోయించాల్సిందే… ముక్క తినిపించాల్సిందే. ఏ విషయంలో అయినా అభ్యర్థులు వెనుకడుగు వేయలేరు.
ఇక ప్రచార ఖర్చు అలా ఇలా కాదు… ర్యాలీలు లేదా ప్రచారంలో పాల్గొనాలంటే జనాన్ని అద్దెకు తెచ్చుకోవాల్సిందే. ఎన్నికల సీజన్‌లో ప్రచారానికి వచ్చే జనానికి ఫుల్ డిమాండ్. ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి నుంచి 2వేల వరకు ముట్టజెప్పాల్సిందే. నగదుకు అదనంగా బీరు, బిర్యానీ కామన్.. ఇవన్నీ ఈసీకి లెక్క చూపని ఖర్చుల కిందకే వస్తాయి. ప్రతిరోజు పగటిపూట ప్రచారం.. రాత్రి పూట ప్రలోభాలు.. కోటి ఖర్చంటే తక్కువలో తక్కువన్న మాటే. ఆ లెక్కన తీసుకున్నా 50-60 కోట్లు ఎగిరిపోతాయి. ఎన్నికల సమయంలో ఖర్చుకు భయపడొద్దని అభ్యర్థులకు తెలుసు. కానీ గ్యాప్ ఎంత పెరిగితే ఖర్చు అంత పెరిగిపోతుంది. అభ్యర్థులపై భారం కూడా అంతకంతకూ పెరిగిపోతుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ… కొన్ని జాబితాలు విడుదల చేసిన టీడీపీ… అభ్యర్థులు ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. ప్రతి రోజూ ఖర్చు పెడుతూనే ఉన్నారు. మరో 58 రోజులు ఖర్చు పెట్టాల్సిందే. గెలిస్తే ఓకే..తేడా వస్తే మాత్రం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న భయం అన్ని పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది.