China: జిన్ పింగ్.. ముచ్చటగా మూడోసారి..!

చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. ఆయన్ను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆ దేశ రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. జిన్ పింగ్ ఎన్నిక మనపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2023 | 01:58 PMLast Updated on: Mar 10, 2023 | 3:05 PM

Gin Ping Elected China President

అనుకున్నట్లే జరిగింది. గతేడాది అక్టోబరులో కమ్యునిస్టు కాంగ్రెస్ సమావేశాల్లోనే జిన్ పింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పుడే మూడోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవడం ఖాయమైంది. దానికి కొనసాగింపే ఈ నిర్ణయం. ఆయనకు అనుకూలంగా 2,952 ఓట్లు రాగా ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అయినా ఆయన్ను వ్యతిరేకించే వారెవరూ కమ్యునిస్టు పార్టీలో లేరు. ఉండలేరు… ఉన్నా బతకనివ్వరు… అధ్యక్ష ఎన్నికకు వేరే పేర్లేవీ ప్రతిపాదనకు కూడా రాలేదు.

చైనాలో ప్రతి పదేళ్లకోసారి అధికారాన్ని తర్వాతి తరానికి అప్పగించడం సంప్రదాయంగా వస్తోంది. చైనా దిగ్గజం మావో జెడాంగ్ కూడా కేవలం రెండుసార్లు మాత్రమే అధికారాన్ని చేపట్టారు. కానీ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి తనను తానే మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నారు జిన్ పింగ్. అంతకుముందే అధ్యక్షుడిగా రెండుసార్లు మాత్రమే ఉండాలన్న నిబంధనను రాజ్యాంగ సవరణతో తొలగించుకుని తనకు లైన్ క్లియర్ చేసుకున్నారు. 68ఏళ్లు దాటిన వారు ఆ పదవిలో ఉండకూడదన్న నిబంధనను కూడా తానే మార్చారు.

2012లో జిన్ పింగ్ అధికారం చేపట్టినప్పుడు ఓ ఉదారవాది అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని ప్రపంచమంతా భావించింది. అప్పటివరకు జిన్ పింగ్ వ్యవహరించిన తీరు, కుటుంబ నేపథ్యం అన్నీ కలిపి ఆయన్ను ఓ సౌమ్యుడిగా చూపాయి. కానీ ఆ అంచనాలు తప్పని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. అనతికాలంలోనే పార్టీలోను, ప్రభుత్వంలోనూ తనదైన ముద్ర వేశారు. పార్టీపై పట్టు బిగించారు. తన వ్యతిరేకుల్ని పక్కకు నెట్టేశారు. విమర్శకుల నోళ్లు మూయించారు. ఎదిరించడానికి ప్రయత్నించిన వారిని నిర్ధాక్షణ్యంగా అణచివేశారు. పార్టీపై పట్టు ఏ స్థాయికి చేరిందంటే దేశంలోనే అత్యంత శక్తిమంతమైన కమ్యునిస్టు పార్టీ కూడా ఆయన ముందు సాగిలపడిపోయింది. మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్ పింగ్ ఎదిగారు.

పార్టీపై పట్టు బిగించడమే కాదు పాలనలోనూ తనదైన శైలిలో దూసుకెళ్లారు. దేశాన్ని పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెట్టించారు. చైనాను అగ్రరాజ్యంగా నిలబెట్టేందుకు కృషిచేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు. చైనీస్ డ్రీమ్ నినాదం ఓ ఉద్యమంలా మారింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెట్టింది. మౌలిక వసతులు పెరిగాయి. దీంతో ప్రజల్లో పలుకుబడి పెరిగింది. దాన్ని అడ్డుపెట్టుకుని తన అధికారానికి ఎదురులేకుండా చూసుకున్నారు. ప్రజా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. నోరు విప్పడానికి అవకాశం లేకుండా చేసారు.

జిన్ పింగ్ తండ్రి చైనా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కానీ మావో కాలంలో సాంస్కృతిక విప్లవ సమయంలో ఆ కుటంబం ప్రభుత్వానికి టార్గెట్ గా మారింది. రాత్రికి రాత్రే కుటుంబం చెదిరిపోయింది. ఓ సోదరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నానాకష్టాలు పడ్డారు. 15ఏళ్లకే గ్రామీణ ప్రాంతంలో పొలం పనులు చేసుకునేవారు. గుహల్లో పడుకునేవారు. తర్వాత కమ్యునిస్టు పార్టీలో చేరడానికి చాలా ప్రయత్నించారు. కుటుంబ నేపథ్యం కారణంగా ఎన్నోసార్లు పార్టీ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. చివరకు తన కల నెరవేర్చుకున్నారు. గ్రామ స్థాయి నుంచి కమ్యునిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. నిబద్దత, నిజాయితీ, తెలివితేటలు కలిగిన కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. మావో మరణం తర్వాత ఆ కుటుంబానికి కొంత ఊరట దక్కింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక ఓ ప్రముఖ గాయనని పెళ్లిచేసుకున్నారు. అప్పటికీ ఆయన గురించి చైనీయులకు పెద్దగా తెలియదు. 1985లో అమెరికా పర్యటన సమయంలో ఆయన చేసిన ప్రసంగం మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007లో పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఐదేళ్ల తర్వాత హుజింటావో స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. చైనా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ రాసుకున్నారు. ఓ వైపు మంచి పాలన అందిస్తూనే మరోవైపు ప్రజా ఉద్యమాలు, మీడియాపై ఉక్కుపాదం మోపారు. మానవ హక్కులనేవి జనం మర్చిపోయేలా చేశారు. ఎవరైనా తనకు భవిష్యత్తులో అయినా ఎదురొస్తారని భావిస్తే వారిని నిర్ధాక్షణ్యంగా హత్య చేయించారు. ఎంతోమంది జైళ్లలో మగ్గుతున్నారు. మరెందరి ఆచూకీనో తెలియకుండా పోయింది. పార్టీ పొలిట్ బ్యూరో మొత్తాన్ని తన మనుషులతో నింపేశారు. అందుకే ఆ పార్టీలో ఇప్పుడాయన ఏం చెబితే అదే వేదం.

జిన్ పింగ్ మరో ఐదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమైంది. ఆ తర్వాత కూడా మళ్లీ కొనసాగుతారేమో తెలియదు. జిన్ పింగ్ ఉన్నంత వరకు మనకు పక్కలో బల్లెం ఉన్నట్లే. చైనా ఎప్పుడూ మనకు మిత్రదేశం కాదు. నెహ్రూ సమయం నుంచి స్నేహం అన్నది కాగితాలకే పరిమితమైంది. అవకాశం వచ్చినప్పుడల్లా మనల్ని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించడం చైనాకు అలవాటు. జిన్ పింగ్ హయాంలో అది మరింత పెరిగింది. నిరంతరం సరిహద్దుల్లో అలజడిని సృష్టిస్తూనే ఉన్నారు. భూభాగాన్ని ఆక్రమిస్తున్నారు. పాకిస్తాన్ కు మద్దతిస్తూ నిత్యం కుంపట్లు రగిలిస్తోంది. జిన్ పింగ్ ఉన్నంత కాలం మనకు ఈ తిప్పలు తప్పవు.

 

(KK)