Titanic: సముద్రగర్భంలో టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి మిస్సింగ్..! టైటాన్‌కు ఏమైంది ? ఆ ఐదుగురు ఎక్కడ ?

టైటానిక్.. ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని విషాద ప్రయాణం. వందలాది మందిని సముద్రగర్భంలో కలిపేసిన చేదు జ్ఞాపకం.. 111 సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో జరిగిన ప్రమాదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు అదే టైటానిక్ మరో ప్రమాదానికి సాక్షిగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2023 | 06:57 PMLast Updated on: Jun 20, 2023 | 6:57 PM

Going To See The Wreckage Of The Titanic Under The Sea And Missing It What Happened To Titan Where Are Those Five

టైటానిక్ శిధిలాలను పరిశీలించేందుకు సముద్రగర్భంలోకి వెళ్లిన ఒక నౌక కనిపించకుండా పోయింది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ఏమైపోయారు.. వారిని తీసుకెళ్లిన వాహనం ఎక్కడ మిస్ అయ్యింది..టైటానిక్ ప్రమాదాన్ని తలపించేలా.. అట్లాంటిక్ సముద్రంలో జరగకూడదని ఏదైనా జరిగిందా ? ఇలాంటివి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ టైటానిక్‌ శిథిలాలను చూడానికి వెళ్లిన ఆ ఐదుగురు ఎవరు ?వాళ్లను తీసుకెళ్లింది ఎవరు ?వాళ్లు ప్రయాణించింది ఎందులో ?

టైటానిక్ దగ్గరకు వెళ్లిన టైటాన్
టైటానిక్.. టైటాన్.. పేర్లు రెండు వినడానికి దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఇవి వేరువేరు. టైటానిక్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణికుల నౌక. 1912 లో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ సిటీకి తొలి ప్రయాణం మొదలుపెట్టింది. దాదాపు 3500 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బాహుబలి నౌకకు తొలి ప్రయాణమే చివరి ప్రయాణంగా మారిపోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ ఐస్ బర్గ్ ను ఢీకొట్టడంతో టైటానిక్ ముక్కలైపోయింది. 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ విషాదాన్ని గుర్తుచేస్తూ ఎన్నో పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వందల ఏళ్ల చరిత్ర తర్వాత మళ్లీ ఇప్పుడు టైటాన్ రూపంలో టైటానిక్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది.

టైటాన్.. సముద్ర గర్భాన్ని చూపించే నౌక
స్పేస్ టూరిజం పేరుతో అంతరిక్షయాత్రలు చేస్తున్న రోజుల్లో ఉన్నాం. కేవలం పరిశోధనల కోసమే కాదు.. సరదాగా కూడా అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రయాణాన్ని సముద్ర గర్భంలోకి చేస్తే..! ఆ అవకాశాన్ని కల్పిస్తుంది టైటాన్ నౌక. సముద్ర గర్భంలోకి ఐదుగురు వ్యక్తులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న సబ్‌మెర్సిబుల్ వెహికల్‌గా దీనిని పిలుస్తారు. ఇందులో పైలెట్‌తో పాటు నలుగురు వ్యక్తులు ప్రయాణించే అవకాశముంటుంది. సముద్రంలో లోపల అందాలను చూడటానికి, డాక్యుమెంటరీలు, సినిమాలు చిత్రీకరించడానికి, సముద్రంలోపలికి టూరిస్టులను తీసుకువెళ్లడానికి దీనిని ఉపయోగిస్తారు. సముద్ర గర్భంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా 96 గంటల పాటు ఉండేలా ఇందులో అన్ని అత్యాధునిక ఏర్పాట్లు ఉంటాయి. పదివేల కిలోల బరువు ఉండే టైటాన్‌ను కార్బన్ ఫైబర్, టిటానియం మిశ్రమంతో తయారు చేశారు. గంటకు ఐదున్నర కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. సముద్రగర్భంలోపలకు 13వేల 123 అడుగులు వెళ్లగలదు. ఈ టైటాన్‌లోనే ఐదుగురు వ్యక్తులు టైటానిక్ శిథిలాలను చూసేందుకు… సముద్రగర్భాన్ని చూసి పరవశించిపోయేందుకు వెళ్లారు. అయితే వాళ్లు టైటానిక్ శిథిలాలను చేరుకోకముందే ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. గమ్యస్థానానికి చేరుకుని తిరిగి సముద్ర ఉపరితలానికి రావాల్సిన టైటాన్ సబ్‌‍మెర్బిబుల్ వెహికల్… మధ్యలోనే మిస్ అయ్యింది. ఏం జరిగిందన్నదే మిస్టరీగా మారింది.

ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది ?
టైటానిక్ నౌక శిథిలాలు అట్లాంటిక్ సముద్ర గర్భంలో కెనడా తీరంలో ఉన్నాయి. న్యూఫౌండ్‌లాండ్ నుంచి 600 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. సముద్ర గర్భంలోకి సాహసయాత్రలు చేయించడంలో పేరు తెచ్చుకున్న ఓషియన్ గేట్ అనే సంస్థ… టైటాన్ వెహికల్ ద్వారా సముద్రగర్భంలోకి ప్రయాణికులను తీసుకెళ్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఇది అలాంటి యాత్రనే చేపట్టింది. ఓషియన్ గేట్ ‌సంస్థకు ఉన్న అనుభవం ప్రకారం.. టైటాన్ వెహికల్ ద్వారా సముద్ర ఉపరితలం నుంచి సముద్రం లోపలికి 4 వేల మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గతంలో కూడా ఇలాంటి జర్నీలు ఎన్నో జరిగాయి. ఈ నెల 18 ఆదివారం కూడా అలాంటి ప్రయాణమే మొదలయ్యింది. అయితే సముద్ర గర్భంలోకి గంటా 45 నిమిషాల పాటు ప్రయాణం చేసిన తర్వాత టైటాన్‌తో కమ్యూనికేషన్స్ తెగిపోయాయి.

కాలంతో పోటీపడుతూ సెర్చ్ ‌ఆపరేషన్
ఒక్కసారి టైటాన్ సముద్రం లోపలకు వెళ్లిన తర్వాత 96 గంటలపాటు మాత్రమే లైఫ్ సపోర్టు ఉంటుంది. ఈలోపు సముద్రం ఉపరితలానికి చేరుకోకపోతే టైటాన్‌లో ఉన్న వారందరి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది..దీంతో యుద్ధ ప్రాతిపదికన సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. అమెరికాతో పాటు , కెనడా కోస్టు గార్డులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి టైటాన్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. అట్లాంటిక్ మహాసముద్రంలో అల్లకల్లోలంగా ఉండే ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ముందుకు సాగడం జరగనే జరగదు. అయినా సరే రెస్క్యూ బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

Titanic Shop In Atlantic Ocan Search Operatin by Titan Organisation

టైటాన్‌లో ఉన్న ఆ ఐదుగురు ఎవరు ?
టైటాన్‌లో ప్రయాణించడమంటే చాలా ఖరీదైన వ్యవహారం. సముద్రగర్భంలోకి విహారం చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. టైటాన్‌లో టైటానిక్‌ శిథిలాలను చూసేందుకు వెళ్లిన వాళ్లందరూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంపన్నులే. ఇందులో ట్రావెల్ చేయాలంటే సుమారు రెండున్నర కోట్ల రూపాయల ఖర్చవుతుంది. బ్రిటన్‌కు చెందిన పర్యాటకుడు Hamish Harding, బ్రిటీష్ పాకిస్థాన్ బిజినెస్ మ్యాన్ షజాదా దావూద్ ఆయన కుమారుడు, సబ్ మెర్సబుల్ వాహనాలను తయారు చేసే కంపెనీ స్టాక్‌టన్ రష్ సీఈఓ తో పాటు ఫ్రెంచ్ ప్రయాణికుడు పాల్ హెన్రీ కూడా ఇందులో ఉన్నారు.

సముద్ర గర్భంలో ఏం జరిగి ఉండొచ్చు ?
కొన్ని ప్రమాదాలను ఊహించడం చాలా కష్టం. కారణాలను విశ్లేషించడానికి చాలా కాలం పడుతుంది. పైగా సముద్ర గర్భంలో చోటుచేసుకునే విపత్తులను విశ్లేషించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన వ్యవహారం. మెరైన్ ఇంజినీరింగ్‌లో సుధీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్లు టైటాన్ మిస్‌ అవ్వడానికి గల కారణాలపై అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. సముద్ర గర్భంలోకి వెళ్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి.. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే సముద్ర ఉపరితలం పైకి వచ్చేందుకు వీలుగా టైటాన్ ‌నుంచి బరువైన పదార్ధాన్ని సముద్రంలోకి వదులుతారు. అంటే టైటాన్‌ను బరువు తగ్గించడం ద్వారా పైకి వచ్చేలా చేసే ఏర్పాటు. ఇలా చేసే సందర్భంలో ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. పవర్ లేదా కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే.. దాన్ని గుర్తించడానికి కూడా చాలా సమయం పడుతుంది. ప్రతికూల పరిస్థితులలో టైటాన్ లోపలకి ఏమైనా లీకేజ్ జరిగి ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత ఊహించడం కష్టమంటున్నారు. ఒకవేళ పూర్తిగా సముద్రగర్భంలోకి వెళ్లిపోయి ఉంటే.. దాన్ని వెలికి తీయడం కూడా సాధ్యపడే వ్యవహారం కాదంటున్నారు. టైటాన్ జాడ తెలిసేంత వరకు, ఆ ఐదుగురు ప్రయాణికులు బయటపడేంత వరకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగబోతోంది.