Top story: గోల్డ్ లోన్… ఈఎంఐల్లో కట్టొచ్చు గురూ…!

అవసరం ఉంది కదా అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా...? అయితే జాగ్రత్త త్వరలో మీ చేతిలో బంగారం ఉన్నా దానికి తగ్గట్లుగా భారీగా రుణం పొందే అవకాశాలు తగ్గబోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 21, 2024 | 02:20 PMLast Updated on: Nov 21, 2024 | 2:20 PM

Gold Loan Pay With Emi

అవసరం ఉంది కదా అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా…? అయితే జాగ్రత్త త్వరలో మీ చేతిలో బంగారం ఉన్నా దానికి తగ్గట్లుగా భారీగా రుణం పొందే అవకాశాలు తగ్గబోతున్నాయి. అంతే కాదు ఈఎంఐల్లో గోల్డ్ లోనే కట్టుకునే ఫెసిలిటీ కూడా రాబోతోంది. గోల్డ్ లోన్ ప్రాసెస్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి…? అసలు ఎంత బంగారం పెడితే అంత రుణం ఎందుకివ్వరు…? ఈఎంఐల్లో చెల్లించడం వల్ల ఉపయోగం ఏంటి…?

అర్జంటుగా డబ్బు అవసరమైందనుకోండి ఎవరో ఒకరి దగ్గర తీసుకుంటాం.. అక్కడ అడ్జస్ట్ కాకపోతే కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అదీ కుదరకపోతే మన ముందున్న ఛాన్స్ గోల్డ్ లోన్. బంగారం తాకట్టు పెట్టు.. డబ్బు పట్టు… ఈ కాన్సెప్ట్ తోనే బ్యాంకులతో పాటు మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు ఏటా లక్షల కోట్ల వ్యాపారం ఇలా బంగారంపైనే చేస్తున్నాయి. మీ దగ్గర బంగారం ఎంత ఉంటే అంత తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇకపై అలా కుదరదు. బంగారం ఉంది కదా అని తాకట్టు పెట్టేస్తానంటే చెల్లదు. మీకు గోల్డ్ లోన్ ఇవ్వాలా వద్దా ఇస్తే మీరు తిరిగి చెల్లిస్తారా లేదా అన్నది చూశాకే బ్యాంకులు బంగారంపై లోను ఇస్తాయన్నమాట. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలన్నమాట.

ఇప్పటివరకు ఉన్న పద్దతిలో గోల్డ్ లోనే తీసుకున్నాక డబ్బు ఎప్పుడు వస్తే అప్పుడు అసలు, వడ్డీ కట్టేసి బంగారాన్ని విడిపించుకోవడం. అయితే గోల్డ్ లోన్ తీసుకుంటే ఓ సమస్య ఉంది. గడువు చివరి వరకు అసలు, వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. దీంతో కాలపరిమితి చివర్లో చెల్లించాల్సి వచ్చేసరికి భారీగానే భారం నెత్తిన పడుతుంది. మధ్యలో ఎంతో కొంత కట్టొచ్చు. కానీ అటూ ఇటూ కాని మొత్తం ఉన్నప్పుడే సమస్య వస్తుంది. ఇక ప్రైవేట్ సంస్థల దగ్గర అప్పు తీసుకుంటే వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది. నెలనెలా వడ్డీ కడితే పర్లేదు. కానీ కొన్నాళ్లు కట్టలేకపోతే మాత్రం ఆ తర్వాత వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కొంతకాలం తర్వాత డబ్బు కట్టలేక బంగారాన్ని వేలానికి వదిలేయడమే. ఈ సమస్యకు త్వరలో విరుగుడు రాబోతోంది.

గోల్డ్ లోన్ ను ఈఎంఐల్లో తీర్చేయవచ్చు. అంటే నెలనెలా వడ్డీతో పాటు అసలు కూడా కట్టొచ్చన్నమాట. ఓ రకంగా ఇది బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకున్న పర్సనల్ లోన్ లాంటిదే. అంటే బంగారాన్ని కుదువపెట్టి ఓ రెండు లక్షల రూపాయల అప్పు తీసుకున్నామనుకోండి… నెలకు ఆరేడు వేల చొప్పున కట్టాల్సి ఉంటుంది. నెలనెలా వడ్డీ తీరిపోవడంతో పాటు ఎంతో కొంత అసలు కూడా కట్టేస్తామన్నమాట. ఒకేసారి పెద్దమొత్తంలో కట్టాల్సిన అవసరం ఉండదు. అన్ని ఈఎంఐలు కట్టగానే మన బంగారం మళ్లీ మన దగ్గరకు వచ్చేస్తుంది. బ్యాంకులు, NBCలు త్వరలో ఈ విధానానికి మారబోతున్నాయి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు, NBCలకు సూచించింది రిజర్వ్ బ్యాంక్.

రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. గోల్డ్ లోన్స్ సమయంలో జరుగుతున్న మరో తప్పు రుణ చెల్లింపు సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. పదిలక్షలు రుణం కావాలంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ దాన్ని చెల్లించలేకపోతే బ్యాంకులు లేదా NBCలు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కోసారి తాకట్టుపెట్టిన బంగారం కన్నా అసలు, కట్టాల్సిన వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రుణగ్రహీతలు బంగారాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారు. ఆ సమస్య లేకుండా ఉండాలంటే ఈఎంఐలు ఓ మార్గమని RBI భావిస్తోంది. పర్సనల్ లోన్స్ తీసుకోవాలంటే మన రుణచరిత్ర మొత్తం చూస్తారు. అన్నీ పరిశీలించాకే ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. కానీ గోల్డ్ లోన్స్ కు మాత్రం అదేమీ లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నది ఆర్థిక నిపుణుల ఆలోచన. ఇక మరో సమస్య బంగారం ధర్లలో మార్పులు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో గ్రాముకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చాయి ఆర్థిక సంస్థలు. ఇప్పుడు బంగారం రేట్లు తగ్గాయి. కొన్ని సందర్భాల్లో గ్రాముపై ఇచ్చిన రుణం కంటే ఇప్పుడు మార్కెట్ రేట్ తక్కువ ఉంది. ఇది ఆ సంస్థలను ముంచేసేదే. ఇలాంటి వాటికి కూడా ఇది పరిష్కారమన్నది ఓ ఆలోచన.

ఇక చాలాచోట్ల బంగారం తాకట్టు పెట్టే సమయంలో అవకతవకలు జరుగుతున్నాయి. బంగారం విలువ లెక్కగట్టడంలో లోపాలు, వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి బయటపడుతున్నాయి. దీనికి తోడు కొందరు నెల నెలా వడ్డీ చెల్లించి దీర్ఘకాలం ఈ రుణాలు కొనసాగిస్తున్నారు. అసలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో ఇలా దీర్ఘకాలం వడ్డీలు కట్టేస్తూ అధిక భారాన్ని మోస్తున్నారు. ఈఎంఐల రూపంలోకి వీటిని తీసుకువస్తే వడ్డీకి ఎంతో కొంత అసలు చెల్లించేసి తక్కువ కాలంలోనే రుణవిముక్తులు కావచ్చన్నమాట. కొన్నిచోట్ల అప్రైజర్ల సాయంతో దొంగ బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. వాళ్లు వడ్డీలు కట్టరు. తర్వాత ఏ ఏడాదికో ఆ బంగారాన్ని పరీక్ష చేయిస్తే అది నకిలీదని తేలుతుంది. అప్పటికే దొంగలు సర్దుకుంటారు. అదే ఇలాంటిదైతే రెండు, మూడు నెలల్లోనే బంగారాన్ని పరీక్ష చేయించొచ్చు. దీనికి తోడు నెలనెలా వడ్డీతో పాటు అసలు రూపంలో ఎంతో కొంత వెనక్కు వస్తే వ్యాపార విస్తృతి పెరుగుతుందని, సంస్థలపై భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే బ్యాంకులు దాదాపు లక్షా 50వేల కోట్ల విలువైన బంగారు రుణాలు ఇచ్చాయి. దీన్నిబట్టే బంగారంపై రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వడం రిస్క్ లేని బిజినెస్సే అయినా అసలు సమస్యంతా రుణగ్రహీత సామర్ధ్యాన్ని చూడకపోవడంతోనే వస్తోంది. దీనికి విరుగుడుగా ఈఎంఐ ఆప్షన్ తో పాటు టర్మ్ లోన్ ఫెసిలిటీ కూడా తీసుకురావాలని బ్యాంకులు భావిస్తున్నాయి. త్వరలోనే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.