టీమిండియాకు గుడ్ న్యూస్, గబ్బా టెస్టుకు బుమ్రా రెడీ
టీమిండియా పేస్ ఎటాక్ ను స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఊహించడం కష్టమే... ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్న బుమ్రా రెండో టెస్టులో స్వల్ప గాయానికి గురయ్యాడు
టీమిండియా పేస్ ఎటాక్ ను స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఊహించడం కష్టమే… ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్న బుమ్రా రెండో టెస్టులో స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో మూడో టెస్టులో బుమ్రా ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది. అడిలైడ్ టెస్టులో అతడి కండరాలు పట్టేసినట్లుగా తెలుస్తోంది. దీంతో తక్కువ వేగంతో బౌలింగ్ చేశాడని, మూడో టెస్టులో అతడు ఆడడం అనుమానమేనన్న వార్తలు వచ్చాయి. ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ డామియన్ ఫ్లెమింగ్ సైతం సంచలన ఆరోపణలు చేశాడు. బుమ్రా గాయాన్ని టీమ్‌మేనేజ్‌మెంట్ దాచి పెడుతుందన్నాడు. దీనికి తోడు మంగవారం ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పాల్గొనకపోవడంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
తాజాగా ఈ వార్తలకు తెరపడింది. బుమ్రా గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో అతడు బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ప్రాక్టీస్ చేసారు. దీనికి సంబంధించిన వీడియోను పలువురు స్పోర్ట్స్ జర్నలిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మూడో టెస్టు కోసం బుమ్రా సిద్ధంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేస్ కు అనుకూలించే గబ్బా మైదానంలో బుమ్రా ఎంత ప్రమాదకారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మూడో టెస్టులో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. రెండో టెస్టులో విఫలమైన పేసర్ హర్షిత్ రాణాపై జట్టు మేనెజ్‌మెంట్ వేటు పడనున్నట్టు సమాచారం. అతడి స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆసీస్ గడ్డపై ప్రసిద్ధ కృష్ణకు మంచి రికార్డుంది. అలాగే స్పిన్నర్ అశ్విన్ స్ధానంలో జడేజాను ఆడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే ఐదురోజులూ వర్షం కురిసే అవకాశాలు 40 శాతం వరకూ ఉన్నట్టు వెదర్ రిపోర్ట్ చెబుతోంది.