Preethi: మెడికో ప్రీతి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం..

రాష్ట్రంలో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనలో.. ఆమె కుటుంబానికి ఇచ్చిన మాటను సర్కార్‌ నిలబెట్టుకుంది. తక్షణ సాయంగా పది లక్షల రూపాయలు ప్రకటించగా.. తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 21, 2023 | 03:05 PMLast Updated on: May 21, 2023 | 3:05 PM

Government Job To Preethi Family

ఈ డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన సర్కార్‌.. ప్రీతి చెల్లె పూజకు హెచ్ఎండీఏలో.. ఆమె చదువుకు తగిన ఉద్యోగాన్ని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ల వేధింపులతో మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ప్రీతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. విద్యార్థి సంఘాలు భారీ ఆందోళనలు నిర్వహించాయ్.

ఐతే ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన తెలంగాణ సర్కార్‌.. తక్షణ సాయంగా పది లక్షల సాయం ప్రకటించింది. నియోజకవర్గ పార్టీ తరపున విరాళాలు సేకరించి.. మంత్రి ఎర్రబెల్లి మరో 20 లక్షలు అందించారు. ఐతే అప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన డిమాండ్‌ను మంత్రి ముందు పెట్టారు. ఈ డిమాండ్‌ను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. సానుకూల స్పందన వచ్చింది.

పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. తన పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏలోనే.. ప్రీతి చెల్లి పూజ చదువుకు సరిపోయే ఉద్యోగాన్ని ఇప్పించారు. వరంగల్‌ కేఎంసీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెడికో ప్రీతి.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న పాయిజన్ ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో.. కోమాలోకి వెళ్లిన ప్రీతిని ముందు.. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చి ప్రీతిని బతికించేందుకు వైద్యులు శాయాశక్తులా ప్రయత్నించారు. ఐతే నిమ్స్‌లో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి.. చివరికి తుదిశ్వాస విడిచింది.