RK Roja: రోజక్క కాస్త తగ్గక్కా..! సజ్జల తిట్టినా మారవా..?
టీడీపీ అంటే నోరేసుకుని ఎగబడిపోయే మంత్రి రోజా కాస్త శృతిమించుతున్నారు. రియాక్షన్ ఓవరాక్షన్‌గా మారిపోయి పార్టీ కొంప ముంచేలా కనిపిస్తోందని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కంట్రోల్‌లో పెట్టాలని తాడేపల్లికి ఫిర్యాదులు రావడంతో హైకమాండ్ క్లాస్ పీకినట్లు టాక్.
టీడీపీ నేత చంద్రబాబు పేరెత్తితే రోజా శివంగిలా రెచ్చిపోతారు. పదునైన పదాలతో ఓ రేంజ్‌లో విరుచుకుపడతారు. సరే అది ఆమె నైజం అనుకుంటే ఒక్కోసారి అది శృతి మించి పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత రోజా వ్యవహరించిన తీరు ప్రజల్లోకి చాలా చెడు సంకేతాలు పంపింది. చంద్రబాబు అరెస్టయిన వెంటనే మంత్రులంతా ప్రెస్‌మీట్లు పెట్టి దాన్ని సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. అయితే రోజా మాత్రం కాస్త ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించగానే బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఆ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఇది కొంప ముంచింది. అరెస్ట్‌పై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ పెద్దలు నానా తంటాలు పడుతుంటే రోజా మాత్రం దూకుడుగా వెళ్లి దెబ్బతీశారు. లోపల ఎంత సంతోషంగా ఉన్నా పైకి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రొటీన్ డైలాగులు చెప్పాల్సిన సమయంలో.. టపాసులు పేల్చడం, స్వీట్లు పంచడం ద్వారా తాము కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు రోజా జనంలోకి సంకేతాలు పంపారు.
రోజా తీరుతో పార్టీ హైకమాండ్ వెంటనే అలర్టైది. మీడియా ఛానళ్లకు సజ్జల స్వయంగా ఫోన్ చేసి రోజా హడావుడి చేస్తున్న విజువల్స్ వాడొద్దని రిక్వెస్ట్ చేశారట. అంతే కాకుండా రోజాకు ఫోన్ చేసి క్లాస్ పీకారట. ఆయనతో కూడా రోజా అడ్డంగా వాదించబోతే కాస్త గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె సైలెంటయ్యారు. కానీ అది రెండ్రోజులే.. మరోసారి మీడియా ముందుకొచ్చి తనదైన శైలిలో రెచ్చిపోయారు. పవన్‌ను రోజూ తిట్టడం కామనే అయినా ఈసారి బ్రాహ్మణిపై కూడా సెటైర్లు వేశారు. జనంలో సానుభూతి ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రోజా లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారని పార్టీ పెద్దలు కలవరపడుతున్నారని సమాచారం.
రోజా నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. మంత్రి పదవి వచ్చాక నోటి దూకుడు బాగానే పెరిగింది. ఆ మధ్య పవన్‌ను ఉద్దేశించి ఆమె కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ పెట్టుకున్నావా అంటూ బూతు అర్థం ధ్వనించేలా మాట్లాడారు. ఇది వైరల్ అయ్యింది. మంత్రిగా బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి అందులోనూ మహిళ ఇలా తలదించుకునే వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరోసారి ఆమె నోరుజారారు. లోకేష్, పవన్ ఎవరికి పుట్టారో అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా పార్టీ పెద్దల దృష్టికి వెళ్లింది.
ప్రత్యర్థి పార్టీ అధినేతగా చంద్రబాబుపై ఆమెకు కోపం ఉండటంలో తప్పులేదు. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు లేదా పార్టీని వీడిన తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను బాధపెట్టి ఉండొచ్చు. కానీ తాను బాధ్యత గల మంత్రిగా కాస్త సంయమనంతో మాట్లాడాల్సి ఉంది. మిగిలిన మంత్రులు కూడా చంద్రబాబును తిడుతున్నా రోజా మరీ ఎక్కువ చేస్తున్నారు. ఓ మహిళగా సున్నితంగా మాట్లాడాల్సింది పోయి నోటి దురుసుతో తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పటికే రోజాపై తన నియోజకవర్గం నగరిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆమె వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోనూ పార్టీకి కొంత డ్యామేజ్ చేస్తుందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. కాస్త ఆమెను తగ్గమని చెప్పమని పార్టీ పెద్దలను కోరుతున్నారు. కానీ రోజా మేడమ్ మాట వినే రకం కాదుగా.!