షమీకి గుజరాత్ షాక్ రిటెన్షన్ లిస్ట్ నుంచి ఔట్

ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ లిస్టులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టుగా కొందరిని రిటైన్ చేసుకుంటుంటే.. మరికొందరిని వదలుకోక తప్పడం లేదు. అదే సమయంలో ఖచ్చితంగా రిటెన్షన్ లిస్టులో ఉంటారనుకున్న ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 07:07 PMLast Updated on: Oct 30, 2024 | 7:07 PM

Gujarat Shock For Shami Out Of Retention List

ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ లిస్టులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టుగా కొందరిని రిటైన్ చేసుకుంటుంటే.. మరికొందరిని వదలుకోక తప్పడం లేదు. అదే సమయంలో ఖచ్చితంగా రిటెన్షన్ లిస్టులో ఉంటారనుకున్న ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాకిస్తున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ మహ్మద్ షమీకి షాకిచ్చినట్టు తెలుస్తోంది. మెగా వేలం నేపథ్యంలో షమీని ఆ జట్టు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గాయం కారణంగా ఏడాదికిపైగా షమీ ఆటకు దూరమవడంతో గుజరాత్ టైటాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్ తర్వాత మహహ్మద్ షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. తర్వాత సర్జరీ చేయించుకున్న ఈ సీనియర్ పేసర్ పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకొని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవలే షమీ ఫిట్‌నెస్ టెస్ట్‌లను కూడా క్లియర్ చేసినట్టు వార్తలు వచ్చినా సెలెక్టర్లు మాత్రం షమీని పరిగణలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు గానీ.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి గానీ అతన్ని ఎంపిక చేయలేదు. అయితే షమీ మాత్రం తన రీఎంట్రీపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రంజీ ట్రోఫీ ఆడి తన సత్తా చాటాలనుకుంటున్నాడు. బెంగాల్ తరఫున నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. కానీ షమీని సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో పాటు అతని వయసు నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకోకుండా వదిలేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2022 ఐపీఎల్ వేలంలో గుజరాత్ 6.25 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ వరుస గాయాలతో గత రెండు సీజన్లలోనూ అతను ఆడలేకపోయాడు. ఇప్పుడు కూడా గాయం నుంచి కోలుకున్నా ఫిట్ నెస్ విషయంలో సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే గుజరాత్ రిస్క్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ఒకవేళ షమీ ఫామ్ సాధించి మునపటిలా సత్తా చాటితే.. వేలంలో తిరిగి కొనుగోలు చేసే అవకాశముంది. షమీ తన ఐపీఎల్ కెరీర్ లో ఓవరాల్ గా 77 మ్యాచ్ లలో 79 వికెట్లు పడగొట్టాడు. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లను రిటైన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు గురువారం సాయంత్రం లోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశమిచ్చారు. నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.