టాప్ లేపిన గుజరాత్ టైటాన్స్ ముంబై , చెన్నై ఇంకా కిందనే
ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫేవరెట్స్ గా భావించిన కొన్ని జట్లు బోల్తా పడితే... అంచనాలు లేని మరికొన్ని జట్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో టీమ్ దాదాపుగా ఐదు మ్యాచ్‌లు ఆడేసింది.

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫేవరెట్స్ గా భావించిన కొన్ని జట్లు బోల్తా పడితే… అంచనాలు లేని మరికొన్ని జట్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో టీమ్ దాదాపుగా ఐదు మ్యాచ్‌లు ఆడేసింది. ఢిల్లీ మాత్రమే మూడు ఆడగా.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ నాలుగు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. హోంగ్రౌండ్ అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది నాలుగో విజయం. బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 , జోస్ బట్లర్ 36, షారూఖ్ ఖాన్ 36, రాహుల్ తెవాటియా 24 రన్స్ తో రాణించారు. ఛేజింగ్ లో రాజస్థాన్ చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పోరాడినప్పటికీ గుజరాత్‌నే విజయం వరించింది. ఆఖర్లో షిమ్రోన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, ధృవ్ జురెల్ సింగిల్ డిజిట్‌కే వికెట్లు కోల్పోయారు. రియాన్ పరాగ్ దురదృష్టవశాత్తు వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి తప్పలేదు.
ఈ విజయం తర్వాత గుజరాత్ 8 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్ళింది.అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. కొత్త కెప్టెన్ రజత్ సారథ్యంలోని ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో దూసుకుపోతోంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడింటిలో గెలిచి నాలుగో స్థానంలో ఉంది. పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ రెండ్రెండు విజయాలతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఈ సీజన్‌లో దారుణంగా మారింది. ముంబై ఇండియన్స్ చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌లను చేజేతులారా చేజార్చుకుంటుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం స్లో బ్యాటింగ్‌తో ఓటములను మూటగట్టుకుంటోంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ హార్డ్ హిట్టర్లతో ఉన్నప్పటికీ 20 ఓవర్లు క్రీజులో నిలబడటం కూడా కష్టంగానే మారింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ జట్లు ఐదు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కొక్క విజయంతో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో చతికిలపడ్డాయి. ఐదేసి సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై, ముంబై పాయింట్ల పట్టికలో కింది నుంచి తొలి మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. మూడో వారం నుంచైనా సన్ రైజర్స్ తో పాటు చెన్నై, ముంబై పుంజుకుంటాయో లేదో చూడాలి.