బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమితో భారత క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం తీవ్రస్థాయిలో ఉంది. పలువురు మాజీ క్రికెటర్లు కోచ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేశాడు. దీనిపై కొందరు కౌంటర్ ఇవ్వడంతో మరోసారి భజ్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరో క్రిప్టిక్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. దీంతో ఈ మాజీ క్రికెటర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాత భజ్జీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. జట్టులో స్టార్ కల్చర్ సంస్కృతి తగ్గితేనే సరైన ఫలితాలు వస్తాయంటూ వ్యాఖ్యానించాడు. సాధారణంగా ప్రతి ఆటగాడికి ఎంతో కొంత పాపులారిటీ, పేరు ప్రఖ్యాతలు అనేవి ఉంటాయన్నాడు. కానీ ఆటే ముఖ్యమన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలన్నాడు. ఆట తర్వాతే ఏదైనా అంటూ చెప్పిన భజ్జీ సెలక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. గతంలో కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే లాంటి వారికి కూడా జట్టు నుంచి తప్పుకోమని బీసీసీఐ, సెలక్టర్లు వారికి చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు . భారత్‌లో సూపర్‌స్టార్ సంస్కృతిని తక్షణమే విడిచిపెట్టాలన్నాడు. రిజర్వ్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదన్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌ది కూడా ఇదే పరిస్థితిగా ఉందన్నాడు. జట్టుకు కావాల్సింది పేరున్న ఆటగాళ్లు కాదన్న భజ్జీ బాగా ఆడే ప్లేయర్లు మాత్రమే కావాలంటూ చురకులంటించాడు. జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఉద్దేశించే భజ్జీ ఈ కామెంట్స్ చేశాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు గంభీర్ టార్గెట్ గానూ హర్భజన్ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్ స్థానంలో వచ్చిన గంభీర్ ఏం సాధించాడంటూ ప్రశ్నించాడు. గంభీర్ వచ్చాక.. టెస్టులు, వన్డేల్లో భారత్ దారుణమైన ఆటతీరు కనబర్చిందన్నాడు. టెస్టుల్లోనైతే పదింట్లో కేవలం మూడింట్లోనే గెలిచిందనీ, ఆడిన మూడు వన్డేల్లో ఒక్కటి కూడా గెలవలేదన్నాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ కామెంట్స్ తో పాటు స్టార్ ప్లేయర్స్ కల్చర్ గురించి భజ్జీ మాట్లాడిన వ్యాఖ్యలపై నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు మరోసారి డబ్బులు తీసుకున్న కుక్కలు అంటూ భజ్జీ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.[embed]https://www.youtube.com/watch?v=jyAwmkA9i2c&pp=ygULZGlhbCBzcG9ydHM%3D[/embed]