మళ్ళీ అదరగొట్టాడుగా, వన్డేల్లోనూ హర్షిత్ గ్రాండ్ డెబ్యూ

ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో భారత ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా అరంగేట్రాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఎందుకంటే కంకషన్ సబ్ గా అడుగుపెట్టి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. దూబే స్థానంలో హర్షిత్ ను ఇలా తీసుకోవడం దుమారాన్ని కూడా రేపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 01:23 PMLast Updated on: Feb 07, 2025 | 1:23 PM

Harshit Impresses Again Makes Grand Debut In Odis

ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో భారత ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా అరంగేట్రాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఎందుకంటే కంకషన్ సబ్ గా అడుగుపెట్టి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. దూబే స్థానంలో హర్షిత్ ను ఇలా తీసుకోవడం దుమారాన్ని కూడా రేపింది. కానీ ఈ మ్యాచ్ లో విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హర్షిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచాడు. అప్పుడు టీ ట్వంటీ అరంగేట్రంలో అదరగొట్టిన ఈ యువ పేసర్ తాజాగా వన్డేల్లోనూ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డేతో వన్డేల్లోకి అడుగుపెట్టాడు. ఆరంభంలో పరుగులు ఇచ్చేసినా తర్వాత కీలక వికెట్లతో సత్తా చాటాడు.అటు టి20, టెస్టుల్లో ఇప్పటికే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ కూడా ఈ మ్యాచ్‌తో తన వన్డే కెరీర్‌ను ప్రారంభించాడు.

హర్షిత్ రాణా మహమ్మద్ షమీతో కలిసి భారత్ బౌలింగ్‌ను ప్రారంభించాడు. కానీ రాణాకు ఆరంభం దక్కలేదు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ రాణా బౌలింగ్ లో పరుగుల వరద పారించాడు. ఒక ఓవర్లో 26 పరుగులు చేశాడు. ఈ ఓవర్లో సాల్ట్ 6,4,6,4,0,6, అంటే మొత్తం 26 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో ఇంత నిరాశపరిచిన ప్రారంభాన్ని రాణా బహుశా ఎప్పటికీ మర్చిపోలేడు. వ‌న్డే అరంగ్రేట మ్యాచ్‌లో.. ఓ ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును హ‌ర్షిత్ ఖాతాలో వేసుకున్నాడు.అయితే రాణా ధైర్యం కోల్పోలేదు. వికెట్లు తీయడానికి గట్టిగానే ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. రాణా 7 ఓవర్లలో 53 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రాణా బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ మరియు లియామ్ లివింగ్‌స్టోన్ ల కీలక వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీస్కోర్ చేసేలా కనిపించింది. ఓపెనర్లు డకెట్ , సాల్ట్ తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు కమ్ బ్యాక్ ఇచ్చారు. వరుస వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్ 52, జాకబ్ బెథెల్ 51, ఫిల్ సాల్ట్ 43 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రాణా 3, రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. షమీ, అక్షర్, కుల్దీప్ తలా ఒక వికెట్ పడగొట్టారు.