Haryana Government: ఆఫీసుల్లో తాగి తూగమంటున్న హర్యానా..!
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు రిలాక్స్ కోసం టీ, కాఫీ అంటూ కేఫిటేరియాల్లో సందడి చేస్తుంటారు. ఇకపై వారు కాఫీ, టీ కాదు మందు కొడుతూ కొలీగ్స్‌తో హస్క్ కొట్టొచ్చు. విదేశాల్లో కాదు మనదేశంలోనే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రాబోతోంది.
ఆఫీసుల్లో మంచినీళ్లు కాదు మందు తాగండి.. తాగి తూగండి అంటూ పర్మిషన్స్ ఇచ్సేసింది ప్రభుత్వం.. హలో ఆగండాగండి.. బాటిళ్లు పట్టుకుని ఆఫీసునే బార్ చేద్దామనుకుంటున్నారేమో.. ఈ పర్మిషన్ మన దగ్గర కాదులెండి.. మన దేశంలోనే కానీ మన దగ్గర కాదన్నమాట. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ప్రకారం కార్పొరేట్ ఆఫీసుల్లో మద్యం తాగొచ్చు. అయితే అందుకు కొన్ని కండిషన్లు కూడా పెట్టింది.
ఆఫీసుల్లో మద్యం తాగడానికి ఇంతకాలం మన దగ్గర పర్మిషన్లు లేవు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఆఫీసుల్లో మందు తాగడానికి పర్మిషన్లున్నాయి. ఇప్పుడు ఆ కల్చర్‌నే మన దగ్గర ప్రవేశపెట్టబోతోంది హర్యానా సర్కార్. దేశంలో ఇలా ఆఫీసుల్లో మందుకొట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం హర్యానానే. అందులో భాగమే ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ. అయితే ప్రతి ఆఫీసులోనే మందు కొట్టే అవకాశాలు లేవు. కేవలం కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే ఈ పర్మిషన్. ఆఫీసు క్యాంటిన్లు, పరిసరాల్లో తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న బీరు, వైన్ వంటివి తాగొచ్చు. అయితే ఆ కార్పొరేట్ సంస్థలో కనీసం 5వేల మంది లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉండాలి.
ఒకే క్యాంపస్‌లో కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు లిక్కర్ సరఫరా చేయవచ్చు. అయితే క్యాంటిన్ కూడా కనీసం 2వేల చదరపు అడుగులకు మించి ఉండాలి. జూన్ 12 నుంచి ఈ సదుపాయం అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ఏడాదికి 10లక్షల రూపాయలు కట్టి మరీ ఆయా సంస్థలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదనంగా 3లక్షల రూపాయల రూపాయల లైసెన్స్ ఫీజు కూడా చెల్లించాలని ఎక్సైజ్ పాలసీలో పేర్కొంది హర్యానా సర్కార్. ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్ షోలు, సెలబ్రిటీ ఈవెంట్లు, మ్యాజిక్ షోల సమయంలో లిక్కర్ సరఫరా చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అందుకు తీసుకునే టెంపరరీ లైసెన్స్ ఫీజు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ మరో సదుపాయం కూడా ఉంది. ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీసు క్యాంటిన్‌లోనే లిక్కర్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. తమతో పాటు తక్కువ ఆల్కహాల్ శాతం కలిగిన లిక్కర్‌ను తీసుకెళ్లొచ్చు.
హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంత మందికి విచిత్రంగాను, మరికొంత మందికి ఆందోళననూ కలిగించొచ్చు. కానీ దాని వెనక పెద్ద వ్యూహమే ఉంది. హర్యానా గుర్‌గావ్‌ను మిలినీయం సిటీ ఆఫ్ ఇండియా అంటారు. దేశంలోనే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌లకు ఇది కేంద్రం. విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తుంటారు. విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డవారు ఇక్కడ కేవలం కాఫీ, టీ, కూల్ డ్రింక్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది హర్యానా ప్రభుత్వం. ఇది మరిన్ని కార్పొరేట్ సంస్థలను ఆకర్షిస్తుందని నమ్ముతోంది.
ఎంత తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్నా ఎక్కువ సంఖ్యలో తీసుకుంటే కిక్కు తలకెక్కక మానదు. మరి ఉద్యోగులు అంత తాగితే పనిచేస్తారా..? లేక మానేస్తారా..? ఉదయం నీట్‌గా తయారై కార్లలో ఇంటి నుంచి రాముడు మంచి బాలుడులా బయలుదేరే కార్పొరేట్ ఉద్యోగులు ఇక రాత్రి సమయంలో మాత్రం ఊగుతూ ఇంటికి వస్తారన్నమాట..! ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందంటూ ఇక పెళ్లాళ మాట వింటారంటారా..!