Diwali Gift: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. సిబ్బందికి కార్లు ఇచ్చిన యజమాని.. ఆఫీస్ బాయ్‌కు కూడా!
హర్యానాలోని పంచకులలో మిట్స్ హెల్త్ కేర్ అనే ఒక ఫార్మా సంస్థ యజమాని అయిన ఎంకే భాటియా.. తన సంస్థలోని 12 మంది టాప్ పెర్ఫామర్స్‌కు దీపావళి కానుకగా కార్లను గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సిబ్బందిని సెలబ్రిటీలుగా పేర్కొన్నారు.
Diwali Gift: కొన్ని కంపెనీలు ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. తమ సంస్థ అభివృద్ధికి పాటుపడిన వారికి తగిన గౌరవం, వేతనంతోపాటు అప్పుడప్పుడూ భారీ నజరానాలు ఇస్తుంటాయి. కొన్నిసార్లు కంపెనీలు.. ఉద్యోగులకు కార్లు, ఇండ్లు వంటివి కానుకలుగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇండియాలోని ఒక కంపెనీ కూడా తమ ఉద్యోగులకు భారీ నజరానాలు ఇచ్చింది. హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ అధినేత.. తమ ఉద్యోగులకు ఏకంగా కార్లు బహుమతిగా అందించారు.
హర్యానాలోని పంచకులలో మిట్స్ హెల్త్ కేర్ అనే ఒక ఫార్మా సంస్థ యజమాని అయిన ఎంకే భాటియా.. తన సంస్థలోని 12 మంది టాప్ పెర్ఫామర్స్‌కు దీపావళి కానుకగా కార్లను గిఫ్ట్ ఇచ్చాడు. ఆ సిబ్బందిని సెలబ్రిటీలుగా పేర్కొన్నారు. అలాగే త్వరలోనే మరో 38 మంది ఉద్యోగులకు కూడా కార్లను అందించాలని నిర్ణయించింది. ఈ కార్లు పెద్ద స్థాయి ఉద్యోగులకే బహూకరించారు అనుకుంటే పొరపాటే.. కార్లు అందుకున్న వారిలో.. ఒక ఆఫీస్ బాయ్ కూడా ఉండటం విశేషం. తమ సంస్థ విజయాని ఈ ఉద్యోగులంతా కఠిన శ్రమ, అంకితభావంతో పని చేశారని, అందుకే కార్లు బహుమతిగా అందించినట్లు సంస్థ యజమాని ఎంకే భాటియా అన్నారు. ఈ కార్లు దీపావళి కానుకలు మాత్రమే కాదని.. కంపెనీపై వారికి ఉన్న నిబద్ధత, విశ్వాసానికి అందిన నజరానాలు అని ఆయన పేర్కొన్నారు.
యజమాని కార్లు బహుమతిగా ఇవ్వడం నిజంగానే వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం.. కార్లు గిఫ్ట్ అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదట. అయినప్పటికీ తమకు కార్లు బహుమతిగా అందించిన యజమానికి ధన్యవాదాలు తెలిపారు. కార్లు గిఫ్ట్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది.