CM kcr Formula: రాజయ్య.. ముత్తిరెడ్డి.. కేసీఆర్ రాజీ ఫార్ములా
బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తులను ఏదో ఒక రకంగా దారికి తెచ్చుకునే క్రమంలో రాజీ ఫార్ములాలతో గులాబీ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది.
అసెంబ్లీ టికెట్లు దక్కక నిరాశలో కూరుకుపోయిన లీడర్లను బుజ్జగించే పనిలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ నిమగ్నమైంది. అసంతృప్తులను ఏదో ఒక రకంగా దారికి తెచ్చుకునే క్రమంలో రాజీ ఫార్ములాలతో గులాబీ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే జనగామ అసెంబ్లీ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ పదవి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి తాటికొండ రాజయ్యకు ఇస్తామనే రాజీ ఫార్ములాను బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ రాజీ ఫార్ములా అమలుకు మార్గం సుగమం చేసేందుకుగానూ.. రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని త్యాగం చేయడానికి రాజేశ్వర్ రెడ్డి రెడీ అయ్యారని తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల రీత్యా తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు బాజిరెడ్డి గోవర్ధన్ కూడా సిద్ధమయ్యారట.
కేసీఆర్ ఇచ్చిన రాజీ ఫార్ములాపై స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి.. అసంతృప్త నేతలతో చర్చలు జరిపారట. కేసీఆర్ రెడీ చేసిన ఈ ఫార్ములా కు దాదాపు అసంతృప్త నేతలంతా సమ్మతించారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పెండింగులో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ రేపు (ఆదివారం) ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక వీటితో పాటు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గా తాటికొండ రాజయ్య పేర్లను కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశం వేదికగా రాజయ్య ఈ ప్రకటన చేశారు. రాజయ్యకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. తనకు మద్దతు తెలిపిన రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ ను వీడుతున్నట్టు మైనంపల్లి హన్మంతరావు ప్రకటించడంతో మల్కాజిగిరికి కొత్త అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకు మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, ప్రస్తుత కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి, మండలి రాధాకృష్ణ యాదవ్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయి. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం రోజు ఆ ఇద్దరు లీడర్లు నేరుగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీని గెలిపించాలని ఇద్దరు నేతలకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.