Pawan Kalyan: జగన్ కాపునేస్తంతో జనసేనను దెబ్బకొట్టారా..? అసలు కాపునేస్తానికి.. పవన్ కళ్యాణ్ కి సంబంధమేంటి..?
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. కాపు నేస్తం అనే సంక్షేమ పథకంతో ప్రజలకు లబ్ధి చేకూరేలా నిడదవోలులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచి చంద్రబాబుపై పెద్దగా టార్గెట్ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే హైలైట్ చేశారు. దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి.. అనే అంశం పై పూర్తి వివరాలు చూద్దాం.
వైఎస్ జగన్ తన నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం పేరుతో సభను నిర్వహిస్తున్నారు. ప్రజల సమక్షంలోనే వారికి అందాల్సిన ఫలాలను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ చేసిన కార్యక్రమం ఒకఎత్తైతే.. నిన్న నిడదవోలు సభ సాక్షిగా చేసిన కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండులో ఉన్న చంద్రబాబు గురించి జగన్ స్పందించారు. ప్రజల డబ్బులను యువతకు ఉపాధి పేరుతో అక్రమంగా దోచుకున్న వాళ్లను సీఐడీ అధికారులు జైలుకు పంపించారన్నారు. ఆ తరవాత నోటుకు ఓటు మొదలు అమరావతి రింగ్ రోడ్డు వరకూ చంద్రబాబు అవినీతి గురించి అనేక ఆరోపణలు చేశారు. ఆ తరువాత బాబుపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు జగన్. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శించారు.
ములాఖత్ కి వెళ్ళి మిలాఖత్..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సీఐడీ అధికారులు చంద్రబాబును నిందితుడిగా అనుమానిస్తూ ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టు అయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాలని ఆదేశించింది. దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసేందుకు ములాఖత్ అయ్యారు. జైలులోకి వెళ్లి బాబుతో భేటీ అయి కాసేపటికి బయటకు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. జైలులో పరామర్శించేందుకు వెళ్ళి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన ఇద్దరూ ఒక్కటే అన్న విషయం మరోసారి బయటపడింది అని తెలిపారు.
కాపులపై కమిటీ పేరుతో కాలయాపన..
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కాపులకు ఎం చేశారని ప్రశ్నించారు జగన్. 2014 నుంచి 2019 వరకూ తాను అధికారంలో ఉన్న సమయంలో కాపులకు సంబంధించి మంజునాథన్ కమిటీ ని వేశారు. దీంతో ఏమి ఫలితం లేకుండా పోయింది. కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ చంద్రబాబు తన పాలనను పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తెలియదా.. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తితో నేడు మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళాడు. దీనిని ఏవిధంగా చూడాలో మీరే అర్థం చేసుకోండి అని ప్రజలకు వదిలేశారు. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసిన వాళ్లతో ఒక కాపు నాయకుడిగా ఎలా మద్దతు ఇస్తారని నిలదీశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ సామాజిక వర్గ ప్రజలను ఆలోచనలో పడేశాయి. నిజమే కదా అప్పుడే ఏమి చేయని వాళ్లు.. ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్మాలన్న అనుమానంలో ఉన్నట్లు సమాచారం.
సంక్షేమంతో సంక్షోభంలోకి నెట్టారా..
కాపు నేస్తం అనే పథకంతో లబ్థిదారుల ఖాతాలోకి రూ. 15వేలు జమ చేస్తూ తనదైన వ్యూహాన్ని జనాల్లోకి పంపిచారు. వరుసగా నాలుగో ఏడాది నిధులు విడుదల చేశారు. ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఎక్కడా పక్కన పెట్టకుండా లబ్ధి దారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చప్పున 536.77 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇలా చేయడం ద్వారా కాపు ఓట్లు తన వైపుకు తిప్పుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో ఇప్పటికీ ఒక స్పష్టత లేదని.. సరైన అభ్యర్థులను ఎన్నుకోవడంలోకూడా పవన్ విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లైనా పవన్ కళ్యాణ్ ఇంకా ఇతర పార్టీలవైపు చూస్తున్నారని చెబుతూ జనసేనను సంక్షోభంలోకి నెట్టారంటున్నారు రాజకీయ పరిశీలకులు.
T.V.SRIKAR