Revanth Reddy: కొడంగల్ లో రేవంత్ బలం పెరిగిందా..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు తన చేతిలోనే ఉన్న ప్రస్తుత తరుణంలో మళ్లీ కొడంగల్‌ పై రేవంత్ ఫోకస్ పెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 02:00 PMLast Updated on: Aug 16, 2023 | 2:00 PM

Has Telangana Tpcc Chief Revanth Reddys Strength Increased In Kodangal

యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ హాట్ అసెంబ్లీ సీట్ల లిస్టులో వికారాబాద్ జిల్లాలోని “కొడంగల్‌” పేరు కూడా ఉంది. ఇది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆయన 2009, 2014 అసెంబ్లీ పోల్స్ లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 పోల్స్ లో మాత్రం ఫలితం రివర్స్ అయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అనూహ్యంగా 9319 ఓట్ల మెజారిటీతో అప్పటి కొడంగల్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై గెలిచారు. ఆ తర్వాత 2019లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన రేవంత్ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాతే రేవంత్‌ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు తన చేతిలోనే ఉన్న ప్రస్తుత తరుణంలో మళ్లీ కొడంగల్‌ పై రేవంత్ ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ ఎంతో సెంటి మెంట్ తో బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచే ప్రారంభించేవారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగబోతున్నానే సిగ్నల్స్ ఇచ్చేలా.. ఇటీవల మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రను ఆయన నిర్వహించారు. వచ్చే పోల్స్ లో కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రధాన పోటీ రేవంత్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్యే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి కొడంగల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవని తేల్చి చెబుతున్నారు.

పావులు కదుపుతున్న రేవంత్..

కొడంగల్ పై తన పట్టును మరింత పెంచుకునే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే ఒకప్పుడు తాను టీడీపీలో ఉన్నప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా నిలిచిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని కొన్నిరోజుల క్రితమే కాంగ్రెస్ గూటిలోకి చేర్చుకున్నారు. గుర్నాథ్ రెడ్డి కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు(1978, 1983, 1989, 1999, 2004లలో) ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు గుర్నాథ్ రెడ్డి కొడంగల్ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రేవంత్ టీడీపీలోనే ఉండగా గుర్నాథ్ రెడ్డి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈవిధంగా మంచి ఫాలోయింగ్ ఉన్న గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో రేవంత్ బలం మరింత పెరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఆ హామీతో గుర్నాథ్ రెడ్డి కూల్..

ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణెం మరోవైపును చూస్తే.. మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఇద్దరూ నాన్ లోకల్ నాయకులని, తనకే కొడంగల్ టికెట్ ఇవ్వాలని గుర్నాథ్ రెడ్డి తొలుత వాదించారని సమాచారం. అయితే ఫ్యూచర్ లో ఎమ్మెల్సీ గా చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నుంచి హామీ లభించడంతో రేవంత్ కు సపోర్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. గతంలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి.. నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శిస్తున్నారు.

డిఫరెంట్ రాజకీయాలు..

కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు మిగతా ప్రాంతాల కంటే డిఫరెంట్ గా ఉంటాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదట్నుంచి.. తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్‌కు పేరుంది. రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం.. ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.