అతను టీమిండియా ఫ్యూచర్ స్టార్, తెలుగోడిపై దాదా ప్రశంసలు
ఐపీఎల్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఊచకోత కోస్తున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఊచకోత కోస్తున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ నితీష్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో నితీష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 42 పరుగులు చేశాడు. అయితే నితీష్ కు వికెట్ దక్కనప్పటికీ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనకు బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా ఫిదా అవుతున్నాడు. పెర్త్ టెస్టులో నితీష్ బ్యాటింగ్ పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అతడు టీమిండియాకు కాబోయే స్టార్ అని పేర్కొన్నాడు. రానున్న కాలంలో నితీష్ టీమిండియా తరుపున గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడంటూ అభిప్రాయపడ్డాడు.
అక్టోబర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నితీష్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన ఛాన్స్‌ను రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. భారీ హిట్టింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి టి20 మ్యాచ్ లో తడబడిన నితీష్ రెండో టి20లో 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై నితీష్ అద్భుతంగా రాణిస్తుండటంతో ఇది తెలుగోడి ఊచకోత అంటూ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.