TS Congress Tickets: మాటిచ్చారు… టిక్కెట్ ఇస్తారా ? కాంగ్రెస్ లో ఆశావహుల టెన్షన్ !

అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) టికెట్స్‌ రాలేదని అసంతృప్తిగా ఉన్న నేతలకు అప్పట్లో రకరకాల తాయిలాలు ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్‌ అధినాయకత్వం. లోక్‌సభ సీటు ఇస్తామని కొందర్ని, కార్పొరేషన్ పదవులు ఇస్తామని మరికొందర్ని బుజ్జగించింది. ఇప్పుడిక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో నాటి బాసల ఊసులు తెర మీదికి వస్తున్నాయి. ఫలానా సీటును ఫలానా లీడర్‌ అంటూ ప్రచారం కూడా మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 12:45 PMLast Updated on: Mar 05, 2024 | 12:45 PM

He Said Will You Give Me A Ticket Tension Among The Aspirants In Congress

అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) టికెట్స్‌ రాలేదని అసంతృప్తిగా ఉన్న నేతలకు అప్పట్లో రకరకాల తాయిలాలు ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్‌ అధినాయకత్వం. లోక్‌సభ సీటు ఇస్తామని కొందర్ని, కార్పొరేషన్ పదవులు ఇస్తామని మరికొందర్ని బుజ్జగించింది. ఇప్పుడిక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో నాటి బాసల ఊసులు తెర మీదికి వస్తున్నాయి. ఫలానా సీటును ఫలానా లీడర్‌ అంటూ ప్రచారం కూడా మొదలైంది. అదే సమయంలో అభ్యర్థుల జాబితా కొలిక్కి తెచ్చే కసరత్తును మొదలుపెట్టింది అగ్ర నాయకత్వం. ఈ క్రమంలోనే కొన్ని లీకులు బయటికి వస్తున్నాయి. టిక్కెట్స్‌ దాదాపు ఖరారేనంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి అప్పట్లో.. పార్లమెంట్ టిక్కెట్‌ ఆఫర్‌ చేసింది నాయకత్వం. నల్గొండ నీదేనని నాడు చెప్పారట.

ఇప్పుడిక టైం వచ్చింది కాబట్టి అదే చర్చ మొదలైంది. కాకుంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా పటేల్‌ రమేష్‌రెడ్డికి బదులు మరోపేరు తెర మీదికి వచ్చింది. అందుకే రమేష్ రెడ్డికి కేబినెట్‌ హోదాతో కార్పొరేషన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక నల్గొండ ఎంపీ సీటును జానారెడ్డి, లేదంటే ఆయన కుమారుడు రఘువీర్‌కు ఇవ్వవచ్చన్నది లేటెస్ట్‌ టాక్‌. కరీంనగర్ పార్లమెంట్ సీటుకు అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టిక్కెట్‌ ఆశించిన ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదే సీటు కోసం వెలిచాల రాజేందర్‌ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనాయకులను ఒప్పించే పనిలో ఆయన బిజీగా ఉన్నట్టు సమాచారం.

ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో సికింద్రాబాద్ సీటుకు మాజీ మేయర్, ఇటీవలే బీఆర్‌ఎస్ (BRS) కు రాజీనామా చేసిన బొంతు రామ్మోహన్ (Bontu Rammohan) పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీ ఓటు బ్యాంకు మీద ఆశతో బొంతు బరిలో దిగాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా సికింద్రాబాద్‌ను ఆశిస్తున్నారు. జహీరాబాద్ టిక్కెట్‌ సురేష్ షెట్కార్ కి దాదాపు ఖరారైంది. మహబూబ్ నగర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వంశీ చంద్ రెడ్డి పేరు ప్రకటించారు. పెద్దపల్లి సీటు విషయంలో చర్చ జరుగుతోంది. ఈ టిక్కెట్‌ రేస్‌లో చాలామందే ఉన్నారట. వారిలో ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. స్థానిక నేతలు.. రాధిక, పెరికె శ్యామ్ లాంటి వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. అయితే వివేక్ కుమారుడికి టికెట్ ఇవ్వడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్తున్నట్టు తెలిసింది.

ఇక చేవెళ్ల నుండి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఖరారైనట్టు సమాచారం. నిజామాబాద్ ఎంపీ సీటుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకే దాదాపు ఖరారైందంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే.. ఇదే సీటు కోసం బాల్కొండ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన సునీల్, మాజీ MLA అరికెల నర్సారెడ్డి కూడా పోటీ పడుతున్నారు. భువనగిరి సీటు విషయంలో పెద్ద చర్చే నడుస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ సీటు నాదే అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా మా కుటుంబంలోని వాళ్ళకేనని చెప్పుకుంటున్నారు. కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి తో పాటు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి పేరు కూడా చర్చలో పెట్టారు. ఇక నాగర్ కర్నూల్‌పై ఇంకా క్లారిటీ లేదు. మరి ఫైనల్‌ లిస్టులో వీళ్ళలో ఎవరెవరి పేర్లు ఉంటాయో చూడాలి.