Delhi Heavy rains : ఢిల్లీ, హిమాచల్‌లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, అసోం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో రుతుపవనాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ వైపు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలకు ముందు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం భారీ కుండపోత వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కుండపోత వర్షం కారణంగా రోడ్లపై చాలా చోట్ల నీరు కూడా కనిపించింది.
ఢిల్లీలోని ఎన్‌సిఆర్ పరిధిలో భారీగా వర్షాలకు పెద్ద ఎత్తున వరద వచ్చింది. 88 ఏళ్ల తర్వాత ఢిల్లీలో రికార్డు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రహదారులు జలమయమవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న మూడు రోజుల పాటు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో కూడా ఇదే తరహా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల వేర్వేరు ఘటనల్లో ఒక వృద్ధుడు, ఓ యువకుడు, నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో రెండు రోజులుగా కురిసిన వానలతో ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. కాగా, వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాగా గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ ప్రజలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ వర్షాలు తీవ్రమైన వేడి నుండి ఉపశమనం కలిగించాయి కానీ.. భారీ వర్షాలతో ఢిల్లీ ప్రజలు చిరుగుటాగుల వణికిపోతున్నారు.