Hema : రేవ్ పార్టీ స్టోరీ మార్చేసిన హేమ
ఈమధ్యకాలంలో ఎక్కువ దుమారం రేపిన అంశం బెంగళూరు రేవ్ పార్టీ. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న జి.ఆర్. ఫామ్‌హౌస్‌కి చేరుకొని అందులో పాల్గొన్న వారందర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈమధ్యకాలంలో ఎక్కువ దుమారం రేపిన అంశం బెంగళూరు రేవ్ పార్టీ. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న జి.ఆర్. ఫామ్‌హౌస్‌కి చేరుకొని అందులో పాల్గొన్న వారందర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. మొత్తం 103 మంది బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసారు పోలీసులు. వారిలో 86 మంది డ్రగ్స్ వాడారని నిర్ధారించారు. వారిలో హేమ కూడా ఉంది. ఈ పార్టీ వ్యవహారంలో నటి హేమ మొదటి నుంచి అనుసరించిన తీరు బెంగళూరు పోలీసులతోపాటు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు హేమ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎట్టకేలకు అందరితోపాటు హేమకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. మే 27న విచారణకు హాజరు కావాల్సింది తెలిపారు. కానీ, హేమ విచారణకు హాజరు కాలేదు. తను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని.. విచారణకు హాజరు కావడానికి తనకు మరికొంత సమయం కావాలని బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు తాజాగా మరో నోటీసు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
రేవ్ పార్టీ విషయం వెలుగులోకి వచ్చిన రోజు నుంచి రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న హేమ తాజాగా మరో వీడియోలో రేవ్ పార్టీపై స్పందించింది. ‘ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్లం కాదు.. తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. ఒక అబద్ధం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి.. అందుకని 99.9 శాతం అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా బెటర్.. అందుకే తాను చాలా హ్యాపీగా ఉంటాను’ అని వీడియో ద్వారా తెలిపింది. మొదటి నుంచీ తాను రేవ్ పార్టీలో లేనని చెబుతూ వచ్చిన హేమ.. ఇప్పుడు ప్లేటు మార్చింది. తప్పు చేస్తే సారీ చెప్పొచ్చు అంటూ కొత్త కథకి శ్రీకారం చుట్టింది. మరి హేమ విషయంలో బెంగళూరు పోలీసులు ఎలా స్పందిస్తారో.. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.