అందుకే అశ్విన్ రిటైర్మెంట్, వీడ్కోలు వెనుక కారణాలివే
బ్రిస్బేన్ టెస్టులో ఐదో రోజు రెండో సెషన్ ముగియనున్న వేళ అనూహ్యంగా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై వార్తలు రావడం మొదలైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్‌గా ఉన్న అశ్విన్‌ని చూసిన విరాట్ కోహ్లీ అతడిని కౌగిలించుకున్నాడు.
బ్రిస్బేన్ టెస్టులో ఐదో రోజు రెండో సెషన్ ముగియనున్న వేళ అనూహ్యంగా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై వార్తలు రావడం మొదలైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్‌గా ఉన్న అశ్విన్‌ని చూసిన విరాట్ కోహ్లీ అతడిని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో కేవలం రెండు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఏదో ముఖ్యమైన ప్రకటన రాబోతోందన్న అంచనాకు అందపరూ వచ్చేశారు. అటు మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్‌తో కలిసి అశ్విన్ కనిపించాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ మధ్య అశ్విన్ అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు కారణాలపై చర్చ జరుగుతోంది.
ఆస్ట్రేలియా గడ్డపై అశ్విన్ ప్రత్యేక ప్రదర్శన ఏమీ చేయలేకపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడిలైడ్ టెస్టులో అతనికి అవకాశం లభించినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో అశ్విన్ ఆవేదనకు గురయ్యాడు.
భారత్ పిచ్‌లపై టెస్టుల్లో తిరుగులేని స్పిన్నర్‌గా పేరొందిన అశ్విన్‌కి.. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కడం లేదు. దాంతో 38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అయితే.. విషయాన్ని ముందే రోహిత్ శర్మకి చెప్పాడట. ఆస్ట్రేలియా పిచ్‌లపై స్పిన్నర్ల ప్రభావం పెద్దగా లేకపోవడంతో.. మిగిలిన రెండు టెస్టుల్లోనూ అశ్విన్‌ను ఆడించే సంకేతాలు కనిపించలేదు. దాంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టులో అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడంతో అప్పుడే రిటైర్మెంట్‌పై అశ్విన్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాడట.
ఆ తర్వాత అడిలైడ్ టెస్ట్‌లో ప్లేయింగ్-11లోకి వచ్చాడు. ఇక్కడ కూడా కోచ్-కెప్టెన్‌ను ఆకట్టుకోలేకపోయాడు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్‌లో అతన్ని బెంచ్‌పై ఉంచారు. అతని స్థానంలో రవీంద్ర జడేజాకు అవకాశం లభించడంతో జడేజా అద్భుత ప్రదర్శన చేసి సెలెక్టర్ల నిర్ణయం సరైనదేనని నిరూపించాడు.ఇక్కడ కూడా అశ్విన్ ప్రదర్శన చర్చనీయంశమైంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై అందరూ నమ్మకంగా ఉండడంతో తనకు ప్లేస్ దక్కే ఛాన్స్ లేదని యాష్ కు అర్థమైంది. జడేజా అద్భుత ప్రదర్శన తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లలో అశ్విన్ బెంచ్‌పై కూర్చుంటాడని అనిపించింది. అటువంటి పరిస్థితిలో సిరీస్ ముగిసేలోపు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 2022 నుంచి టీ20లకి, 2023 నుంచి వన్డేలకి దూరమైన అశ్విన్.. గత కొంతకాలంగా కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు.
అశ్విన్ ఆకస్మికంగా రిటైర్ కావడానికి మరో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం అశ్విన్ వయసు 38 ఏళ్లు. అశ్విన్ ఇప్పుడు రిటైర్ కాకపోయినా మహా అయితే మరో రెండేళ్లు ఆడగలడు. కేవలం స్వదేశంలో జరిగే టెస్ట్‌ల్లోనే అవకాశాలు వస్తుండటంతో అశ్విన్ మహా అయితే మరో 10-12 టెస్ట్‌లు ఆడగలడు. ఈ మధ్యలో ఫామ్ కోల్పోయి లేదా జట్టుకు భారంగా మారడం కంటే అంతా బాగున్నప్పుడే రిటైర్ కావడం మంచిదని అశ్విన్ భావించి ఉంటాడని అర్థమవుతోంది.