Himalayas: కరుగుతున్న హిమానీ నదాలు.. అంచనాలకు అందని స్థాయిలో కనుమరుగు
అంచనాలకు అందనిస్థాయిలో, హిమాలయాల్లో మంచు కరిగిపోతోందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. 2000-2020 మధ్య కాలంలో మంచు విపరీతంగా కరిగిపోయింది. ఈ మంచు దాదాపు 570 మిలియన్ల ఏనుగులతో సమానం అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Himalayas: హిమానీ నదాలు (హిమాలయ పర్వతాల్లోని మంచు) గణనీయంగా తగ్గిపోతున్నాయి. అంచనాలకు అందనిస్థాయిలో మంచు కరిగిపోతోందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. 2000-2020 మధ్య కాలంలో మంచు విపరీతంగా కరిగిపోయింది. ఈ మంచు దాదాపు 570 మిలియన్ల ఏనుగులతో సమానం అని నేచర్ జియోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. హిమానీ నదాల గురించి తొలిసారిగా పూర్తిస్థాయిలో బ్రిటన్, చైనా, ఆస్ట్రియా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. వీళ్లు వెల్లడించిన విషయాలు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి.
47 శాతం పెరిగిన నదులు
మంచు కరగడం వల్ల నదులు పెరుగుతాయి. దీనివల్ల హిమాలయ పర్వతాల్ని ఆనుకుని అనేక నదులు పుట్టుకొస్తున్నాయి. వీటిని ప్రోగ్లేసియల్ లేక్స్ అంటారు. 2000-2020 కాలంలో 47 శాతం ఇలాంటి నదులు పెరిగాయట. ఇవి విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం పెరిగాయి. నదులు, వాటిలో నీళ్లు పెరిగితే మంచిదే. కానీ, మంచు కరగడం వల్ల ఏర్పడే నదులు మాత్రం మానవాళికి ప్రమాదకరం. ఈ స్థాయిలో మంచు కరగడాన్ని ఇంతకుముందు పరిశోధకులు గుర్తించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు దీనిపై అంతగా దృష్టిపెట్టలేదు. ఇక్కడి పరిస్థితిని గమనించే శాటిలైట్స్ లేకపోవడం వల్ల కూడా సరైన అంచనాలు అందలేదు. అలాగే ఈ పరిణామం భూమి పై పొరకు కింద జరుగుతుంది.
అందువల్ల దీన్ని గుర్తించడం అంత సులభం కాదు. పైగా పైన కనిపించే నీటినే పరిగణనలోకి తీసుకుంటారు. శాటిలైట్లు పైన కనిపించే మంచును మాత్రమే గుర్తించగలవు. నీళ్ల కింద ఉన్న మంచును కాదు. కానీ, ఆ నీటి లోపల మంచు కూడా కరుగుతుంది. అయితే, సరస్సుల సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోతుండటంపై పరిశోధకులు దృష్టి సారించారు. హిమాలయాల్లో ఇప్పటికే 6.5 శాతం మంచు కరిగిపోయింది.
కనుమరుగయ్యే ఛాన్స్
హిమానీ నదాలు కరిగే ప్రక్రియ ఈ శతాబ్దం అంతా కొనసాగుతుందని పరిశోధకులు అంటున్నారు. హిమాలయాల్లోనే కాకుండా మంచు పర్వతాలున్న ప్రతి చోటా జరుగుతుంది. గడిచిన 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేర మంచు కరిగిపోయింది. అంటే 1.7 లక్షల కిలోలు. ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం వెయ్యి రెట్లు ఎక్కువ. గ్రేటర్ హిమాలయాలే కాకుండా.. మధ్య హిమాలయాల్లోని హిమానీ నదాలు కూడా వేగంగా కరిగిపోతున్నాయి. గాలోంగ్ కో హిమానీ నదం ఇప్పటికే 65 శాతం కరిగిపోయినట్లు పరిశోధకులు అంటున్నారు. హిమానీ నదాలు కరిగిపోయేందుకు వాతావరణ మార్పులు ప్రధాన కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు.