కెనడా-ఇండియా దౌత్యం రద్దు.. ఫార్మా రంగంపై ప్రభావం చూపుతుందా..?
ప్రపంచ దేశాల్లో ప్రతి రోజూ ఏదో ఒక చోట యుద్దం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా కెనడా – భారత్ యుద్దం మాత్రం అణుబాంబులతో, మారణాయుధాలతో, యుద్ద నౌకలతో కాకుండా ఎగుమతి, దిగుమతులపై.. పరస్పర దౌత్యంపై పడుతోంది.
కెనడా – భారత్ ఇరు దేశాల మధ్య రాజుకున్న ఖలిస్తాన్ చిచ్చు ఇప్పట్లో చల్లారేలాలేదు. దీనికి ప్రదాన కారణం కెనడా ప్రధాని తన రాజకీయ ప్రయోజనాలు అన్నది స్పష్టం అయిపోయింది. దీంతో మన దేశం కూడా వెనక్కి తగ్గకుండా తాము ఎలాంటి తప్పు చేయలేమని ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందేమోనన్న అనుమానాలు వర్తక, వ్యాపార వర్గాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య 8 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యం నమోదవుతోంది. అందులో 4బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు మన దేశం నుంచే ఎగుమతి అవుతాయి. ఇందులో ముఖ్యమైనవి ప్లాస్టిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, బాస్మతీ బియ్యం, ఔషధాలు, చేపలు, రొయ్యలు, ఆభణాలు, దుస్తులు ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా ఎగుమతులు..
పైన తెలిపిన వస్తువుల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఔషధ ఎగుమతుల్లో ఏమైనా ప్రభావం పడుతుందేమో అన్న అనుమానం ఫార్మా రంగ కంపెనీల్లో తలెత్తుతోంది. అయితే దీనికి బలం చేకూర్చేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయిన మందులను కెనడాలో అధికశాతం మంది వినియోగిస్తూ ఉంటారు. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, బయోటెక్ ఇలా తదితర కంపెనీలు తమ ఎగుమతులను పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాయి.
ఫార్మా నిపుణులు ఏమంటున్నారు..
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకూ మన దేశం నుంచి సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన ఔషదాలు కెనడాకు ఎగుమతి అయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న వాణిజ్యం కనుకనే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉంటుందా అని ఫార్మా వర్గాలు పరిశీలిస్తున్నారు. మందుల ఎగుమతి, దిగుమతుల్లో ఏమైనా సుంకాలు విధిస్తారా, దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతుందా, మార్కెట్ ఈ భారాన్ని భరిస్తుందా అన్న కోణంలో నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశీలనలో అర్థమైందేమిటంటే ఇరుదేశాల తాజా పరిస్థితుల వల్ల ఫార్మా రంగంలో పెద్దగా సమస్యలు రాకపోవచ్చు అని తేల్చారు నిపుణులు. దీనికి గల కారణాలను కూడా నిశితంగా విరించారు.
ఎగుమతులపై ప్రభావం ఎంత..
మనదేశం నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం ఔషధ ఉత్పత్తిలో కెనడాకి ఎగుమతి అయ్యే వాటా కేవలం 2 శాతం మాత్రమే అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్ల విలువైన మందులు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. అందులో అధికంగా ఎగుమతి అయింది అమెరికాకే అని గణాంకాలను వెల్లడించారు. 35 శాతం వరకూ అమెరికాకు ఎగుమతి అయితే ఐరోపా, ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా దేశాలకు కూడా ఇందులో కొంత శాతం ప్రతి ఏటా ఎగుమతి అవుతున్నాయి. దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే కెనడా కంటే కూడా అధికంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నందున ఫార్మా రంగంపై పెద్దగా ప్రభావం పడదని తెలిసింది.
కెనడా – ఇండియా దౌత్యం దెబ్బతినడం వల్ల ఇప్పటికైతే నష్టం కొంత శాతం మాత్రమే ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగి వివాదం ముదిరి దీర్ఘకాలం కొనసాగితే పరిస్థితులు మారిపోతాయంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో ఇది భౌతిక యుద్దానికి తెరతీస్తే అప్పుడు కొంతమేర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
T.V.SRIKAR