ఆలయం అనే పేరు ఎలా వచ్చింది – దేవాలయాలు ఎన్ని రకాలు
ఆలయం... అంటే ఒక పవిత్రత. ఆధ్యాత్మిక ప్రాంతం. భగవంతుడు కొలువైన ప్రదేశం. అయితే... అసలు ఆలయం అనే పేరు ఎలా వచ్చింది. దేవాలయాల్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి...? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయం… అంటే ఒక పవిత్రత. ఆధ్యాత్మిక ప్రాంతం. భగవంతుడు కొలువైన ప్రదేశం. అయితే… అసలు ఆలయం అనే పేరు ఎలా వచ్చింది. దేవాలయాల్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి…? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయం అంటే.. మత సంబంధమైన ప్రార్థనలకు వినియోగించే కట్టడం. జీవాత్మను పరమాత్మతో లయం చేసే ప్రదేశం. ఆలయం అంటే ఇల్లు అని అర్థం. నివాస స్థలమని కూడా అనొచ్చు. దేవుడు లేదా దేవతలు ఉండే ప్రదేశం కనుక.. దేవాలయం అంటారు. గుడి, కోవెల, మందిరం అని కూడా పిలుస్తుంటారు. వివిధ మతాల్లో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణ విధానాలు ఉంటాయి. శ్రీవైఖానస శాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థం భగవంతుడు అర్చారూపియై భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోనూ ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు.. ఆయా స్థానాల్లో ఆవాహన చేయబడి ఉంటారు.
చారిత్రికంగా దేవాలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆలయాల్లో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి. ఆలయాలు మొత్తం ఐదు రకాలు. మొదటిది స్వయంవ్యక్త స్థలాలు.. అంటే భగవంతుడే స్వయంగా అవతరించినవి. రెండోది… దివ్య స్థలాలు… దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి. ఇక మూడోది సిద్ధ స్థలాలు… వీటిని మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి. నాలుగోది పౌరాణ స్థలాలు… పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి. ఐదోది.. మానుష స్థలాలు.. ఇవి రాజులతో… భక్తులతో ప్రతిష్టించినవి. శివుడిని స్థాపించిన ఆలయాలను… శివాలయాలు. విష్ణువు లేదా విష్ణు అంశతో స్థాపించబడిన దేవాలయాలన్ని విష్ణాలయం, శ్రీరాముడు స్థాపించడిన దేవాలయం రామాలయం, సూర్యనారాయణమూర్తి స్థాపించబడిన దేవాలయం.. సూర్యాలయం, సుబ్రహ్మణ్య స్వామి స్థాపించబడిన దేవాలయం సుబ్రమణ్యస్వామి ఆలయం, వేంకటేశ్వరుడు స్థాపించబడిన దేవాలయం వేంకటేశ్వరాలయం అని పిలుస్తుంటారు.
ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని కచ్చితంగా పాటిస్తారు. ఆలయం లోపల వాహనంపై గానీ, పాదరక్షలతో గాని తిరగకూడదు. ఆలయానికి ప్రదక్షణ చేసిన తర్వాతే లోపలికి ప్రవేశించాలి. తలపాగతో, ఆయుధంతో ఆలయంలోకి ప్రవేశించకూడదు. అంతేకాదు… ఉత్తచేతులతో కూడా వెళ్లకూడదు. తిలకం ధరించకుండా, ఆహారం తింటూ లోపలికి వెళ్లకూడాదు. ఆలయం ముందు కాళ్లు చాపుకుని కూర్చోకూడదు. వివాదాలు పెట్టుకోకూడదు. దేవుని ఎదుట పరనింద చేయకూడదు. ఆలయాల్లో ఇతరులకు నమస్కరించకూడదు.. భగవంతుని ముందు అందరూ సమానమే అని భావించాలి.