స్లిప్ అంటే ఎంత ప్రేమో ? కోహ్లీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు
వరల్డ్ క్రికెట్ లో ఒక్కో బ్యాటర్ కూ ఒక్కో వీక్ నెస్ ఉంటుంది... దానిని అధిగమిస్తేనే పరుగులు చేయగలుగుతారు.. లేకుంటే ప్రత్యర్థి బౌలర్లు అదే వీక్ నెస్ పై దెబ్బకొడుతూ ఔట్ చేస్తుంటారు..

వరల్డ్ క్రికెట్ లో ఒక్కో బ్యాటర్ కూ ఒక్కో వీక్ నెస్ ఉంటుంది… దానిని అధిగమిస్తేనే పరుగులు చేయగలుగుతారు.. లేకుంటే ప్రత్యర్థి బౌలర్లు అదే వీక్ నెస్ పై దెబ్బకొడుతూ ఔట్ చేస్తుంటారు.. కొత్తగా కెరీర్ ప్రారంభించిన ఆటగాడికి వీక్ నెస్ ను అధిగమించేందుకు టైమ్ పడుతుంది…కానీ దశాబ్దానికి పైగా సుదీర్ఘమైన కెరీర్ ఉండీ, రికార్డులకే కేరాఫ్ అడ్రస్ మారిపోయిన విరాట్ కోహ్లీ ఇప్పటికే ఒకే వీక్ నెస్ తో వికెట్ ఇచ్చుకుంటున్నాడు. అదే ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్ళే బంతులను వెంటాడి ఔటవ్వడం… అంతకుముందు రెండుమూడేళ్ళ పాటు కోహ్లీ ఈ వీక్ నెస్ ను అధిగమించాడు.. కానీ ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మళ్ళీ ఆ బలహీనతకే బలవుతున్నాడు.
కోహ్లీ కవర్ డ్రైవ్ అద్భుతంగా ఆడతాడు… ఈ షాట్ ను ఆడాలంటే ఆఫ్‌సైడ్ వెళ్లే బంతులను టార్గెట్ గా చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటర్లను ఊరించేందుకు బౌలర్లు వాటినే వేస్తుంటారు. కానీ ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఔటవడం ఖాయం. ప్రస్తుతం అదే పరిస్థితిని కోహ్లీ ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడే అలవాటు కోహ్లీకి కెరీర్ ఆరంభం నుంచే ఉంది. దీని కారణంగా అతడి టెస్ట్‌మ్యాచ్‌ల సగటు కూడా దెబ్బతిందని మాజీ క్రికెటర్లు చాలా మంది విశ్లేషించారు. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కూడా కోహ్లీ ఆఫ్‌స్టంప్‌నకు దూరంగా వెళ్లే బంతులను ఇబ్బంది పడుతూ ఆడటాన్ని గమనించినట్లు గతంలోనే చెప్పాడు. ప్రస్తుత ఆసీస్ టూర్ లో కోహ్లీ అదరగొట్టేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ విరాట్ ఈ టూర్ లో ఒకే ఒక సెంచరీ చేశాడు. మిగిలిన వాటిలో పూర్తిగా నిరాశపరిచాడు. సిరీస్ మొత్తం ఆఫ్ స్టంప్స్ కు దూరంగా వేసిన బాల్స్ నే ఆడబోయి వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ వీక్ నెస్ ను బాగా పట్టేసిన ఆసీస్ బౌలర్లు విరాట్ ను ఎప్పటికప్పుడు తమ ఉచ్చులో బిగిస్తూనే ఉంటున్నారు.
తాజాగా సిడ్నీ టెస్టులోనూ విరాట్ ఇలాంటి బంతికే వెనుదిరిగాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ.. ఆ తర్వాత అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. అయితే మ్యాచ్ సాగుతున్నా కొద్దీ సహనం కోల్పోయిన కోహ్లీ.. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ డెలివరీలకే వెనుదిరిగాడు. సిడ్నీ టెస్టులో ఔట్ తర్వాత సోషల్ మీడియాలో విరాట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. స్లిప్ లో ఉన్న ఫీల్డర్ తో ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టు…. జాగ్రత్తగా వాళ్ళ చేతుల్లోకి బంతిని కొడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. భార్య అనుష్క కంటే స్లిప్ లో ఉన్న ఫీల్డర్స్ తోనే కోహ్లీ లవ్ లో ఉన్నట్టున్నాడంటూ వెటకారం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడికి కూడా తప్పలేదు. కానీ ఈ వీక్ నెస్ ను అధిగమించి మళ్ళీ పుంజుకునే అవకాశం కోహ్లీకి ఇప్పటికీ ఉందన్నది కొందరి మాజీల అభిప్రాయం… మరి రానున్న మ్యాచ్ లలోనైనా విరాట్ ఈ బలహీనత నుంచి బయటపడతాడేమో చూద్దాం.