Home Affairs Ministry: సోషల్ మీడియా పోస్టులపై చర్యలు.. కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్
సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలపై, కామెంట్లపై కేసులు ఉండవని తాజాగా కేంద్ర హోం శాఖ నుంచి విడుదలైన లేఖ దేనికి సంకేతం.
సోషల్ మీడియా నేటి యుగానికి అత్యంత ప్రాచుర్యాన్నిచ్చే వేదికగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ తమ వీడియోలు, అభిప్రాయాలు, టాలెంట్ ను పలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారు. వాటిని చూసి కొందరు కామెంట్ పెట్టడం లైక్ కొట్టడం షేర్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రసిద్దికెక్కిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు మంచికి దీనిని ఉపయోగిస్తుంటే మరి కొందరు చెడుకు ఉపయోగిస్తున్నారు. దీని ప్రభావం మంచి వారిపై కూడా పడుతోంది. అసభ్యకరమైన పోస్ట్, కామెంట్లు చేస్తూ మరొకరి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నాయా అనే అనుమానాలు కలుగుతోంది. దీనికి నిదర్శనం గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలే వేదికగా ఒక సర్కులర్ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్లు, కామెంట్లు పెట్టడం నేరం కాదు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఒక వేళ చేసి ఉంటే వెంటనే రద్దు చేయాలి. లేకుంటే ఈ దస్త్రాన్ని అస్త్రంగా మార్చుకుని కోర్టును ఆశ్రయించవచ్చని తెగ సందేశాన్ని ఇస్తున్నారు కొందరు నెటిజన్స్. అయితే ఎన్నికల వేళ ఇలాంటి ప్రచారం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ప్రభుత్వాలు ఖండించకపోవడం వెనుక ఏదో బలమైన రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
దస్త్రాన్ని అస్త్రంగా మాలిచి..
ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీగా నోట్ లో తెలుస్తోంది. అంటే ఎన్నికల వేళ దీనిని తీసుకురావడం వెనుక కారణం ఏంటి. ఎవరు ఎలాంటి ప్రచారాన్ని అయినా చేసుకోవచ్చు ఎలాంటి శిక్షలు, కేసులు ఉండవు అని పరోక్షంగా సందేశాన్ని ఇస్తుందా. ఇది కేంద్ర ప్రభుత్వం పనే అంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలను మాటల దాడులు, అసభ్యకర పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు లేని ఈ కాగితం గత వారం నుంచి మాత్రమే ఎందుకు వెలుగులోకి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని భావిస్తున్నారు.
అన్ని రంగాల్లో విస్తరించిందిలా..
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ లేని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్క దానికి ఇది వేదిక అయిపోయింది. సంతోషం పంచుకోవాలన్నా.. దు:ఖాన్ని తెలియజేయాలన్నా దీని ద్వారానే జరుగుతోంది. రాజకీయ నాయకులే కాదు, గ్లామర్ రంగాలకు చెందిన వారు కూడా దీని ద్వారానే ప్రసిద్దికెక్కుతున్నారు. వ్యాపారాలు, వాటి ప్రమోషన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇది నెలవుగా మారింది. వీటిని ఫాలో అవుతూ లైక్, షేర్, కామెంట్ పెట్టే వాళ్లు అధికంగా ఉన్నారు. దీంతో దీనిని ప్రచార మాధ్యమంగా మార్చుకోవాలని కొందరు రాజకీయ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే దీనిని తెరపైకి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు కొందరు నిపుణులు.
బీజేపీకి ఫాలోయింగ్ ఎక్కువే..
దేశంలో ఎవరికీల లేనంత చరిష్మా నరేంద్ర మోదీకి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని కొన్ని సంస్థలు సర్వేలు చేసి మరీ వెల్లడించాయి. అత్యంత ప్రజాధారణ, పాపులారిటీ కలిగిన వ్యక్తుల్లో మోదీ రికార్డు సృష్టించినట్లు గతంలో వెల్లడైంది. దీనిని అస్త్రంగా మలిచి ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నట్లు కొందరు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమేనేమో అనేలా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. పైగా నోట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. మామూలుగానే సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటారు కొందరు ఆకతాయిలు. వారికి ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటిస్తే ఇక చూస్తూ ఊరుకుంటారా. ప్రతి ఒక్కరినీ కన్నంలోని ఎలుకను లాగినట్లు పాత ఫైల్స్ అన్నీ బయటకులాగా వారి స్వేచ్ఛకు భంగం కలిగించే అవకాశం లేకపోలేదు. పైగా అమెరికాలో నుంచి బీజేపీ ప్రత్యేక ఐటీ వింగ్ ఏర్పాటు చేసుకుని తన కార్యకలాపాలను సాగిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఈ లేఖ సర్కులేట్ అవ్వడం కాస్త చర్చనీయాంశం అయింది.
తెలంగాణ పోలీసుల స్పందన..
గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న లేఖపై స్పందించారు తెలంగాణ పోలీసులు. గతంలో కేవలం పోస్ట్ల పైనే ఫోకస్ పెట్టేవాళ్లు ఇప్పుడు కామెంట్లపై కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న వేళ సామాజిక మాధ్యమాల వేదికగా విధ్వంసాన్ని, అరాచకాన్ని సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పోలీసు అధికారులు. అయితే కేంద్రం లేఖ ద్వారా నిర్ణయం వెలువరించిన వేళ అన్ని రాష్ట్రాల పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
T.V.SRIKAR