Falaknuma Express: అగ్నికి ఆహుతైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్.. ఈ పాపం ఎవరిది..?
భారత్ రైళ్లకు ఏమైంది. మన్నటి వరకూ ఒడిశాలో బోగీలు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురై నేలపై పడిన పరిస్థితి. నిన్న బీహార్ లో బలమైన ఐరన్ చక్రాలు విరిగిన దుస్థితి. ఇక తాజాగా ఫలక్ నుమా రైలు బోగీలు మంటలకు దగ్ధమయ్యింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ రైల్వే అధికారులు మేల్కొవల్సిన సమయం ఆసన్నమైంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రైల్వే శాఖ పనితీరుకు సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి నెలకొంది.

Howrah to Secunderabad Falaknuma Express met with a fire accident at Yadadri Bhuvanagiri
తాజాగా హౌడా నుంచి సికింద్రాబాద్ వరకూ వచ్చే ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ లో తీవ్రమైన మంటలు చెలరేగాయి. దాదాపు ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణీకులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ ఘటన గురించి తెలుసుకున్న లోకో పైలెట్ రైలును ఉన్నచోటే నిలిపి వేయడంతో ప్రయాణికులు క్రిందకు దిగేశారు. దీంతో ప్రాణనష్టం సంభవిచలేదని ఇప్పటి వరకూ రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. రైలును పగిడిపల్లి బొమ్మాయిపల్లి మార్గంలో నిలిపివేశారు. ముందుగా ఎస్ 4, ఎస్ 5 బోగీల్లో దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి. దీంతో ఈ రెండు బోగీల లింకును వేరు చేసే ప్రయత్నం చేశారు సిబ్బంది.
లగేజీ పై ప్రయాణీకుల ఆవేదన..
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకునేందుకు ఎలాంటి మార్గం లేదు. దీని కారణంగా ఇప్పటి వరకూ మంటలను ఆర్పే ప్రయత్నాలు జరగలేదు. స్థానిక పోలీసులు, ఆర్డీవో ఇతర ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు తలెత్తిన బోగీలో నుంచి క్రిందకు దిగిన ప్రయాణీకులు తమ సామానులు మొత్తం రైల్లో ఉండిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరి లగేజి మొత్తం అగ్నికి ఆహుతైపోయిందని ఆవేదనకు గురౌతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన విషాదఛాయలు అలుముకున్నాయి. రైల్వే అధికారులు అక్కడ ఉన్న ప్రయాణీకులను ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సికింద్రాబాద్ కు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆరు బస్సులను కేటాయించినట్లు తెలిపారు. అలాగే సికింద్రాబాద్ నుంచి లోకమాన్య తిలక్ అనే రైలు విషాదం చోటు చేసుకున్న ప్రాంతంలోని ప్రయాణీకులను తీసుకొచ్చేందుకు బయలుదేరినట్లు సికింద్రాబాద్ రైల్వే అధికారులు తెలిపారు.
సిగరెట్ తాగడమే ప్రమాదానికి కారణం..
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తి సిగ్నలింగ్ వద్ద సిగరెట్ తాగుతూ ఉన్నట్లు గుర్తించారు తోటి ప్రయాణీకులు. ఇతనికి పదే పదే హెచ్చరించినప్పటికీ తోటి ప్రయాణీకుల మాటను బేకాతరు చేస్తూ సిగరెట్ తాగేందుకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రైలులో సిగరెట్, గుట్కా వంటి మాదకద్రవ్యాలు నిషేధం. అయినప్పటికీ ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడటం పట్ల రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఒక్కరి తప్పిదానికి ఇందరి ప్రాణాలు బలి అవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు. ముందుగా ఎస్ 4 నుంచి మంటలు అన్ని బోగీల్లోకి వ్యాపించినట్లు రైలులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ వివరించారు.
మంటలు ఆర్పే సౌకర్యాలు తీసుకురావాలి..
ఫలక్ నుమా రైలు దగ్ధమవ్వడానికి గల కారణాలను ఇప్పుడే అంచనావేయలేమని సీపీఆర్వో తెలిపారు. ప్రస్తుతానికి అయితే ప్రాధమిక నివేదిక ప్రకారం షాట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలె వచ్చిన బెదిరింపులేఖకు ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. గతంలో వచ్చిన ఆ లేఖపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఇన్ని లక్షల మంది ప్రయాణిస్తున్న రైలు బోగీల్లో మంటలు నిలువరించేందుకు సరైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో భారత రైల్వే పూర్తి స్థాయిలో విఫలం అయిందని చెప్పాలి. ఇలాంటి మంటలు రైల్వేకి కొత్తేమీ కాదు. ఒకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడే మేలుకొని ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ముందడుగు వేయాలి. ఇప్పటికే రైలు దగ్థం అయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కనీసం మంటలను అదుపుచేసే సాధనాలు, పరికరాలు ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువడుతున్నాయి. మాకు కావల్సింది హంగు ఆర్భాటాలు కలిగిన వందేభారత్ రైళ్లు కాదు.. కనీస రక్షణ సౌకర్యాలు కలిగిన బోగీలు అందుబాటులోకి తీసుకురమ్మని ప్రయాణీకులు వాపోతున్నారు. ఇలాగే వరుస రైలు ప్రమాదాల జరిగితే అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగిన రైల్వే వ్యవస్థపై, రైలు ప్రయాణాలపై విశ్వసనీయత, నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
T.V.SRIKAR