Gaza Bomb Blast : గాజా ఆసుపత్రిపై యుద్ద రాకెట్ల దాడిలో అమాయక ప్రజలు బలి
హమాస్ - ఇజ్రాయెల్ యుద్దం ధాటికి గాజా నలిగిపోతోంది. తాజాగా స్థానిక అల్అహ్లి ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న బాంబు పేలుడు ఘటనలో దాదాపు వందల మంది ప్రాణాలు విడిచారు. దీనిపై పరస్పరం ఇరు దేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం గాజా. ఇక్కడి అల్అహ్లీ ఆసుపత్రిలో బాంబు దాడి జరిగింది. దీంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి శస్త్రచికిత్స చేయడం డాక్టర్ల వల్ల కావడం లేదు. దీనికి కారణం బాధితుల సంఖ్యకు తగ్గట్లుగా పరికరాలు లేకపోవడమే అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే గత 12 రోజులుగా జరుగుతున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్దంలో గాయపడిన వారు ఇక్కడే వచ్చి చికిత్స చేసుకుంటున్నారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో యద్ద రాకెట్ గతితప్పి ఆసుపత్రి మీద పడటంతో వందల మంది మృతి చెందారు. కొందరి శరీరాలు చుట్టుపక్కన ఉన్న మైదానంలో, చెట్ల పొదల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రాంతం మొత్తం ఎటు చూసినా హృదయ విదారకమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి.
పరస్పర ఆరోపణలు..
ఒకవైపు ఆసుపత్రిలో క్షతగాత్రుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ గాజా నుంచి ప్రయోగించిన రాకెట్ గతి తప్పి ఆసుపత్రి పార్కింగ్ ఆవరణలో వచ్చి పడిందని ఆరోపిస్తోంది. ఆసుత్రులపై ఇజ్రాయెల్ దాడులు చేయదనే నమ్మకంతో గాజా వాసులు వాటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆ ప్రాంతం మొత్తం క్షతగాత్రుల ఆర్థనాదాలతో మారుమోగిపోతుంది. గాజా వద్ద మానవతా సాయాన్ని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అయితే ఆ ప్రాంతం మొత్తం శిధిలాలతో నిండిపోయింది. దీని కారణంగా సరిహద్దుల్లో వేల లారీలు నిలిచిపోయాయి. అల్ అహ్లీ ఆసుపత్రి వద్ద జరిగిన దాడి కచ్చితంగా హమాస్ పనే అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజా స్మశాన ప్రాంతం నుంచి రాకెట్ ను పేల్చినట్లు మా రాడార్ గుర్తించిందని ఇజ్రాయెల్ సైన్య అధికార ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. పాలస్తీనాలోని మిలిటెంట్ సమూహానికి చెందిన ఇస్లామిక్ జిహాదీల పనే అని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసుపత్రి ఘటనకు ఇజ్రాయెల్ కారణమని పేలుడు తీవ్రత, బాంబు వచ్చిన మార్గం ఇజ్రాయెల్ వైపే ఉన్నాయని హమాస్ ఆరోపించింది.
ప్రాణాలు పోతున్నా ఆగని దాడులు
ఒకవైపు అమాయకుల ప్రాణాలు పోతుంటే హమాస్, ఇజ్రాయెల్ ఇలా అరోపించుకుంటున్నాయి. పైగా ఎక్కడా దాడులు మాత్రం ఆగడం లేదు. బుధవారం సాయంత్రం ఆసుపత్రి ఘటన మరువక ముందే గాజా సిటీలోని ఒక భవనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 40 మంది మృతి చెందారు. అలాగే పాలస్తీనియన్లు రక్షిత ప్రదేశంగా భావించే దక్షిణ గాజాపై బాంబుల వర్షం కురవడంతో అక్కడి ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నుసౌరాత్ ప్రాంతంలోని ఒక బేకరీ పై కూడా దాడి జరిగింది. ఇందులో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులన్నీ ఇజ్రాయెల్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేకి కొన్ని గంటల ముందు సంభవించాయి.
జో బైడెన్ వ్యాఖ్యలు.. అమెరికా ఆంక్షలు..
తాజాగా ఆసుపత్రిలో జరిగిన బాంబు దాడులకు కారణం ఇజ్రాయెల్ అయి ఉండదని భావిస్తున్నట్లు జో బైడెన్ తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఇది హమాస్ పనే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అన్నారు. ఇరు దేశాల అధ్యక్షుల భేటీ తరువాత జో బైడెన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇరుదేశాల పరస్పర దాడుల్లో వేల మంది మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పై జరిగిన ఘటనతో జోర్ధాన్ రాజుతో జో బైడెన్ భేటీ రద్దయినట్లు తెలిపారు. దీనిపై ఆ దేశ రాజు స్పందించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హమాస్ దాడులను ఖండిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్ కి చెందిన 10 మంది ముఠా సభ్యులపై ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలులేదని ప్రకటించింది. దీంతో గాజా, సుడాన్, తుర్కియే, అల్జీరియా, కతార్ లతో హమాస్ తో ఆర్థిక సంబంధాలు కొంతమేర రద్దైనట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలపై మోదీ స్పందన..
గాజా ఆసుపత్రి ఘటన పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. పరస్పర దేశాల యుద్దంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించిన బాధ్యులపై చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
T.V.SRIKAR