Hyderabad  : హైదరాబాద్ ని మింగేశావ్ కదరా !

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Balakrishna) వ్యవహారంలో తవ్వేకొద్దీ...కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తులు బయటపడటంతో...ఆయన వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరన్న దానిపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు ? శివబాలకృష్ణ వెనుకున్న మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఎవరు ? అన్న విషయాలను కూపీ లాగుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2024 | 09:11 AMLast Updated on: Feb 03, 2024 | 9:11 AM

Hyderabad Has Been Swallowed Up

 

 

 

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Balakrishna) వ్యవహారంలో తవ్వేకొద్దీ…కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తులు బయటపడటంతో…ఆయన వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరన్న దానిపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు ? శివబాలకృష్ణ వెనుకున్న మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఎవరు ? అన్న విషయాలను కూపీ లాగుతున్నారు.

రెరా కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణ అక్రమ సంపాదన మొత్తం…HMDA కేంద్రంగా సాగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే MAUDలో ఇంఛార్జ్ డైరెక్టర్‌గా కొనసాగారు. HMDA నుంచి దస్త్రాలను పంపించిన శివబాలకృష్ణ… MAUDలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. నిజాలను రాబట్టేందుకు బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణను సర్వీస్‌ నుంచి తొలగించింది ప్రభుత్వం.

శివబాలకృష్ణ దగ్గర పని చేసే అధికారుల మెడకి కూడా ఏసీబీ కేసు చుట్టుకుంటోంది. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మొదటి నుంచి బాలకృష్ణతో కలిసి పని చేసే ఉద్యోగులందర్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణకు చెందిన బినామీ ఆస్తులను భారీగా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పని చేసే ఉద్యోగులను విచారిస్తే…ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. ఆయన బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ సీజ్‌ చేశారు. కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు…లావాదేవీలు, బీనామీల వివరాలపై కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ? ఏయే సంస్థలకు అనుమతులు ఇచ్చారు ? శివబాలకృష్ణకు సహకరించిన మాజీ ఐఏఎస్‌, ఆ మాజీ మంత్రి ఎవరు ? వారంతా ఎలాంటి ప్రొత్సాహం ఇచ్చారు ? శివ బాలకృష్ణ దందాల్లో వారి పాత్ర ఏంటి ? అక్రమంగా వసూలు చేసిన డబ్బును ఏ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారు ? బినామీలుగా ఎవర్ని ఉపయోగించుకున్నారు ? వారికి తెలిసే బినామీలుగా వారు పేర్లను ఉపయోగించారా ? లాంటి అంశాలపై ఏసీబీ విచారిస్తోంది.

మరోవైపు శివబాలకృష్ణ కారణంగా ఇబ్బందిపడ్డ బాధితులంతా ఏసీబీ చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశాడనీ.. భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకున్నట్లు ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. తన అక్రమాలకు అడ్డు లేకుండా పలువురు రాజకీయ నేతల పేర్లు వాడుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన భూమిపై…కోర్టులో వివాదం నడుస్తోంది. ఆ వివాదాస్పద భూమిని ఓ నిర్మాణ సంస్థకు చెందినదిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారని సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. నగర శివారులో సెక్షన్‌ అధికారి బినామీగా 20 ఎకరాల ఖరీదైన భూమి కొన్నట్టు సమాచారం. శివబాలకృష్ణ దగ్గర నమ్మకంగా పని చేసే వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది సొంతూళ్లకు వెళ్లినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. వారిని గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.