Rain Alert: భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయ్. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయ్. తెలంగాణలో మూడు రోజుల వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీస్తుండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం నుంచి శుక్రవారం వరకూ ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయ్. ఐఎండీ అంచనా వేసింది. మరో 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వివరించింది. వానాకాలం మొదలైనా సరైన వర్షాలు కురవకపోవడంతో దిగాలుగా ఉన్న రైతులకు.. వాతావరణ శాఖ అంచనాలు కొత్త జోష్ నింపుతున్నాయ్.