RAJA SINGH : బీజేపీ ప్రచారానికి.. రాజాసింగ్ దూరం..
హైదరాబాద్ పార్లమెంట్ (Parliament Elections) స్థానానికి బీజేపీ టిక్కెట్టును విరంచి హాస్పిటల్స్ చైర్ పర్సన్ మాధవీలతకు ప్రకటించినప్పుడు.
హైదరాబాద్ పార్లమెంట్ (Parliament Elections) స్థానానికి బీజేపీ టిక్కెట్టును విరంచి హాస్పిటల్స్ చైర్ పర్సన్ మాధవీలతకు ప్రకటించినప్పుడు. ఆడోళ్ళు తప్ప మగోళ్ళు లేరా అని ప్రశ్నించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. అంతకుముందు BJP LP పోస్ట్ ఇవ్వలేదని అలిగారు. ఇప్పుడు బీజేపీ ప్రచారానికి కూడా వెళ్ళట్లేదు. అసలు రాజాసింగ్ కమలం పార్టీలో ఉన్నట్టా… లేనట్టా… అని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
తనకు అవకాశం ఇస్తే హైదరాబాద్ (Hyderabad) లోక్ సభ స్థానంలో (Lok Sabha Elections) నిలబడాలని రాజాసింగ్ (Rajasingh) భావించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న గోషామహల్ కూడా అదే నియోజకవర్గంలో ఉంది. MIM ఎంపీ అసదుద్దీన్ (MP Asaduddin) ఒవైసీకి తానైతే గట్టి పోటీ ఇస్తానని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం రాజాసింగ్ కి కాకుండా మాధవీలతకు ఇచ్చింది. దాంతో ఆడోళ్ళకి టిక్కెట్ ఇవ్వడమేంటని రాజాసింగ్ ప్రశ్నించడం సంచలనంగా మారింది. దానికితోడు అసెంబ్లీలో BJP చీప్ పదవి కూడా ఇవ్వకపోవడంతో బీజేపీ అధిష్టానంపై అలకబూనారు రాజాసింగ్.
మే13న జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం మిగతా నియోజకవర్గాల్లో లాగే హైదరాబాద్ లోనూ బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆఫీస్ బేరర్స్ తో పాటు ఏ సమావేశానికీ రాజా సింగ్ అటెండ్ అవ్వట్లేదు. విజయ్ సంకల్ప్ సభల్లోనూ పాల్గొనలేదు. నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ ముఖం చూసి కూడా చాన్నాళ్ళయిందని అంటున్నారు.
తెలంగాణలో డబుల్ డిజిట్ లో పార్లమెంట్ సీట్లు తెచ్చుకోవాలని బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్ లాంటి నాయకులు చెబుతున్నారు. అయినా సరే… రాజా సింగ్ మాత్రం హైదరాబాద్ లో బీజేపీ ప్రచారానికి కూడా వెళ్ళట్లేదు. బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా రాజాసింగ్ ని గానీ, పార్టీలో ఇతర పెద్దలతో పనిలేకుండా సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో పాతబస్తీలోని బీజేపీ కేడర్ కన్ ఫ్యూజన్ లో పడింది. అసలు మాధవీలతకు రాష్ట్ర స్థాయిలో బీజేపీ సీనియర్ల మద్దతు ఉందా… లేదా అన్న అనుమానంలో ఉన్నారు. ఆమె ప్రచారానికి వెళితే… పెద్దలు ఏమంటారో అని డౌట్ లో పడ్డారు. అటు రాజాసింగ్ వైఖరితో ఏం చేయాలో తెలీక బీజేపీ శ్రేణులు కన్ ఫ్యూజన్ లో ఉన్నాయి.