Ukraine: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో కొత్త మలుపు-భారీ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ పేల్చివేత..దీని వెనుక ఉన్నదెవరు ?

యుద్ధం తారాస్థాయికి చేరింది. సంవత్సరంన్నర కాలంగా సాగుతున్న ఘర్షణ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బాంబుల మోతలు, డ్రోన్ దాడులకు భిన్నంగా ఈసారి భారీ కట్టడాల పేల్చివేత వరకూ వచ్చింది. ఉక్రెయిన్ -రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద డ్యామ్‌ను పేల్చివేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2023 | 06:10 PMLast Updated on: Jun 06, 2023 | 6:10 PM

Hydro Electric Dam Blast In Ukraine Russia War

నిన్న మొన్నటి వరకు వార్‌ జోన్‌లో రక్తాన్ని పారించిన ఉక్రెయిన్ రష్యా దేశాలు ఇప్పుడు కీలకమైన డ్యామ్‌లను పేల్చివేసుకునే వరకు తీసుకొచ్చాయి. అతిపెద్ద రిజర్వాయర్‌ను ఒక్కసారిగా పేల్చివేయడంతో సమీప ప్రాంతాలపైకి వరద పోటెత్తింది. గంటల వ్యవధిలోనే డ్యామ్ చుట్టుపక్కల ఏరియాలు మునిగిపోయాయి. వేలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. కీలకమైన డ్యామ్‌ను టార్గెట్‌గా చేసుకుని పేల్చివేయడంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ తీవ్రత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

డ్యామ్ ఎక్కడుంది ? దీన్నే ఎందుకు పేల్చారు ?
ఉక్రెయిన్‌లోని కేర్సన్ రీజియన్.. ఇది రష్యాతో భూభాగాన్ని పంచుకుంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన కొంతకాలానికే ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించిన రష్యా సైన్యం.. దీన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. టెక్నికల్ గా ఈ ప్రాంతమంతా ఉక్రెయిన్‌దే అయినా.. ప్రస్తుతం రష్యా కంట్రోల్‌లో ఉంది. ఈ రీజియన్లోనే ఉంది కహ్వోకా డ్యామ్.. వివిధ దేశాల గుండా ప్రవహిస్తూ యూరోప్‌లోని అతి పెద్ద నదుల్లో ఒకటిగా ఉన్న…డినిప్రో నదిపై ఈ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఉంది. 67 ఏళ్ల క్రితం సోవియట్ రష్యా కాలంలో ఈ నదిపై నిర్మించిన ఆరు కీలకమైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఈ డ్యామ్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి బలైపోయింది. రాత్రికి రాత్రే దీన్ని పేల్చివేయడంతో డ్యామ్ ముక్కలైపోయింది. రష్యా సరిహద్దుల్లో పోర్టు సిటీలో ఉన్న ఈ డ్యామ్ ఉక్రెయిన్‌కు చాలా కీలకమైంది. దిగువ, ఎగువ ప్రాంతాల ప్రజల వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్‌లో కూడా ఈ డ్యామ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డ్యామ్‌కు వంద మైళ్ల దూరంలో యూరోప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. దీనికి కావాల్సిన కూలింగ్ వాటర్ కూడా కహ్వోకా డ్యామ్ నుంచే అందుతుంది. సరైన సమయంలో కూలింగ్ వాటర్ అందకపోతే.. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదంలో పడుతుంది.

ఇంతకీ ఈ డ్యామ్‌ను ఎవరు పేల్చేశారు ?
యుద్ధం అనే చదరంగంలో ఎవరి వ్యూహాలు వాళ్లకుంటాయి. ఎవరికి తగ్గ ఆట వాళ్లు ఆడతారు. ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా అదే జరుగుతుంది. డ్యామ్ ఉక్రెయిన్‌ది…కానీ ఆ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుంది. మరి డ్యామ్‌ను ఎవరు పేల్చారు. ? రష్యానే కుట్ర చేసి పేల్చేసిందని ఉక్రెయిన్ చెబుతుంటే.. ఉక్రెయిన్ సైన్యమే.. డ్యామ్‌ను నాశనం చేసిందని రష్యా చెబుతుంది. మీరంటే మీరంటూ ఎవరికి వాళ్లు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. డ్యామ్ ఎవరు పేల్చారన్నది ఇప్పటి వరకు అంతుపట్టలేదు. తమ దేశాన్ని దారికి తెచ్చుకునేందుకు డ్యాములు కూల్చినా.. క్షిపణులు ప్రయోగించినా.. పుతిన్‌ ముందు తలవంచేదే లేదని.. జెలెన్‌స్కీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

సైనికులు రాకుండా అడ్డుకునేందుకే పేల్చేశారా ?
సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలపై దాడులు చేసి.. తమ దేశంలో కలుపుకునే ప్రక్రియను రష్యా ఎప్పటి నుంచే అమలు చేస్తుంది. ఉక్రెయిన్‌లో అంతర్భాగంగా ఉన్న కేర్సన్‌ను కూడా రష్యా తనలో కలిపేసుకుంది. ఈ ప్రాంతాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కహ్వోకా డ్యామ్ పై భాగంలో ఉన్న రోడ్డు పై నుంచి ఉక్రెయిన్ సైన్యం.. రష్యా ఆక్రమించిన ప్రాంతానికి ఈజీగా చేరుకోవచ్చు. తమ దేశ సైనికుల రాకను అడ్డుకునేందుకే డ్యామ్‌ను పేల్చివేసినట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. డ్యామ్‌ను పేల్చివేయడం వల్ల తమ ఆధీనంలో ఉన్న భూభాగమే మునిగిపోతుందని.. అలాంటి పరిస్థితిని తాము ఎందుకు కల్పిస్తామని రష్యా వాదిస్తోంది.

అందరి వేళ్లూ రష్యా వైపే..!
యుద్ధం మొదలుపెట్టిందే రష్యా.. అందుకే పశ్చిమ దేశాలన్నీ డ్యామ్ పేల్చివేత వెనుక రష్యా ఉన్నట్టు అనుమానిస్తున్నాయి. రష్యా యుద్ధంతంత్రంలో భాగంగానే కీలకమైన డ్యామ్‌ను పేల్చివేసి ఉంటారని ఉక్రెయిన్ సహా ఆ దేశానికి మద్దతిస్తున్న అన్ని దేశాలు అనుమానిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడానికి, యుద్ధాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు రష్యా కుటిలనీతిని అమలు చేస్తోందని యూరోపియన్ యూనియన్ విమర్శిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రాతమండలిని తక్షణం సమావేశపరిచి రష్యాపై చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. పర్యావరణాన్ని దెబ్బతీసేలా, సహజవనరులు దుర్వినియోగమయ్యేలా చేసి ఉక్రెయిన్‌కు నష్టం కలిగించేందుకే రష్యా డ్యామ్ కూల్చేసిందని ఉక్రెయిన్ చెబుతుంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ కొట్టి పడేస్తున్న రష్యా.. దీనిపై విచారణకు ఆదేశించింది. డ్యామ్ ఎవరు పేల్చేశారో తామే తేల్చుతామంటోంది. చూడాలి డ్యామ్ వార్ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఎటు తీసుకెళ్తుందో…!