ఓటమికి నాదే బాధ్యత కెప్టెన్సీపై రోహిత్ హాట్ కామెంట్స్
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు చరిత్రలోనే అత్యంత ఘోరపరాభవాన్ని న్యూజిలాండ్ రుచి చూపించింది. స్వదేశంలో మన టీమ్ ను కివీస్ వైట్ వాష్ చేసింది. మూడు టెస్టుల సిరీస్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన న్యూజిలాండ్ 3-0తో వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది.
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు చరిత్రలోనే అత్యంత ఘోరపరాభవాన్ని న్యూజిలాండ్ రుచి చూపించింది. స్వదేశంలో మన టీమ్ ను కివీస్ వైట్ వాష్ చేసింది. మూడు టెస్టుల సిరీస్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన న్యూజిలాండ్ 3-0తో వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది. తొలి మ్యాచ్ లో పేస్ పిచ్ పై బోల్తా పడిన టీమిండియా తర్వాత రెండు మ్యాచ్ లలోనూ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఓటమి పాలైంది. ఈ సిరీస్ ఆద్యంతం కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. సారథిగానూ అంత ప్రభావం చూపని హిట్ మ్యాన్ వ్యక్తిగతంగానూ విఫలమయ్యాడు. తాజాగా ముంబై టెస్టులో ఓటమి తర్వాత రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ అవ్వడం బాధగా ఉందన్నాడు. ఈ సిరీస్‌లో ఘోర తప్పిదాలు చేశామని, న్యూజిలాండ్ మెరుగ్గా ఆడిందని కితాబిచ్చాడు.
ఇక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తాను పూర్తిగా విఫలమయ్యానని రోహిత్ అంగీకరించాడు. ఏ మ్యాచ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని చెప్పాడు. టెస్టు మ్యాచ్, టెస్టు సిరీస్ కోల్పోవడం అంత తేలికైన విషయం కాదనీ, దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. తాము అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయామన్న విషయం ఒప్పుకోవాల్సిందేనని చెప్పేశాడు. తొలి రెండు టెస్టుల్లో తాము మెరుగైన స్కోరు చేయలేదనీ, ఓటములకు అదే కారణమైందన్నాడు. మూడో టెస్టులో ఆధిక్యంలో ఉండి కూడా మ్యాచ్ ను చేజార్చుకోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నాడు. 147 పరుగుల టార్గెట్ ను ఈ పిచ్ పై ఛేజ్ చేయొచ్చన్నాడు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తాము పూర్తిగా విఫలమయ్యామని రోహిత్ ఒప్పుకున్నాడు. ఈ పిచ్‌పై ఎలా ఆడాలో రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, గిల్ చక్కగా చూపించారని ప్రశంసించాడు.
గత మూడు నాలుగేళ్ల నుంచి ఈ పిచ్‌లపై ఆడుతున్నా కూడా ఈ సారి సరైన ప్రదర్శన కనబరచలేకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇక వ్యక్తిగత బ్యాటింగ్ పరంగానూ తాను స్థాయికి తగినట్టు ఆడలేదన్న రోహిత్ అది కూడా ఓటమికి కారణమైందన్నాడు. కాగా మూడో టెస్టులో గెలిచే స్థితి నుంచి భారత్ ఓడిపోవడం అభిమానులనూ నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 28 రన్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా బౌలింగ్ పరంగా అదరగొట్టింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా కివీస్ ను 174 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్ పై పట్టుబిగించేలా చేశారు. అయితే ఈ సిరీస్ లో మరోసారి బ్యాటర్ల వైఫల్యమే భారత్ కొంపముంచింది. ఫలితంగా స్వదేశంలో తొలిసారి వైట్ వాష్ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.