ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్, టాప్ ప్లేస్ తో బుమ్రా రికార్డ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త ఏడాదిని నెంబర్ వన్ బౌలర్ గా ఆరంభించనున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇప్పటికే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న బుమ్రా రేటింగ్ పాయింట్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త ఏడాదిని నెంబర్ వన్ బౌలర్ గా ఆరంభించనున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇప్పటికే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న బుమ్రా రేటింగ్ పాయింట్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుమ్రా 904 పాయింట్లతో టాప్ ర్యాంకులో నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో బుమ్రా ఈ ఘనత సాధించాడు. తద్వారా అశ్విన్ తర్వాత 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. గబ్బా టెస్టులో 9 వికెట్లు తీసిన బుమ్రా 14 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 2016 తర్వాత 900 రేటింగ్ పాయింట్లు దాటిన భారత బౌలర్ గా ఘనత సాధించాడు. గతంలో అశ్విన్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. సిరీస్ లో ఇప్పటి వరకూ 21 వికెట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ అతని నెంబర్ వన్ ప్లేస్ మరింత పటిష్టమైంది. ఓవరాల్ గా ఈ సిరీస్ లో ప్రదర్శనతోనే బుమ్రా 48 రేటింగ్ పాయింట్లను పెంచుకున్నాడు. సఫారీ పేసర్ కగిసో రబాడ రెండో స్థానంలోనూ, ఆసీస్ పేసర్ హ్యాజిల్ వుడ్ మూడో స్థానంలోనూ నిలిచారు. ఇదిలా ఉంటే గబ్బా టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ఐదో స్థానంతో తన కెరీర్ ను ముగించాడు. అటు రవీంద్ర జడేజా నాలుగు స్థానాలు దిగజారి 10వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక తాజా ర్యాంకింగ్స్ లో హైదరాబాదీ పేసర్ ఒక స్థానం మెరుగై 24వ ర్యాంకులో నిలిచాడు.
మరోవైపు బ్యాటింగ్ విభాగంలో టాప్ 10 జాబితాలో భారత్ నుంచి యశస్వి జైశ్వాల్ ఒక్కడే ఉన్నాడు. జైశ్వాల్ ఐదో స్థానంలో ఉండగా… రిషబ్ పంత్ 11, గిల్ 20వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ 21వ ర్యాంకులో నిలిచాడు. మరోవైపు సూపర్ ఫామ్ లో ఉన్న ఆసీస్ హిట్టర్ ట్రావిస్ హెడ్ తాజా జాబితాలో ఒక స్థానం మెరుగై నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న కెఎల్ రాహుల్ 10 స్థానాలు మెరుగై 40వ ర్యాంకులోనూ, గబ్బాలో కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 9 స్థానాలు ఎగబాకి 42వ ర్యాంకులోనూ నిలిచారు. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ లో ఉండగా… అశ్విన్ మూడో ర్యాంకుతో కెరీర్ ను ముగించాడు.